
యూరియా కోసం పడిగాపులు
గండేపల్లి: కొంతకాలం నుంచి యూరియాకు కృత్రిమ కొరత ఏర్పడటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సొసైటీలకు యూరియా వచ్చిందనే తెలిసిన తక్షణమే రైతులు పరుగులు తీస్తున్నప్పటికి పూర్తిస్థాయిలో యూరియా దక్కకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. మండలంలోని మల్లేపల్లి సొసైటీలో యూరియా ఉందని సమాచారం తెలుసుకున్న రైతులు శుక్రవారం సొసైటీ వద్ద బారులు తీరారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పడిగాపులు కాసారు. కొందరు రైతులకు పూర్తిస్థాయిలో యూరియా అందకపోవడంతో సిబ్బంది ఇచ్చిన ఒక్క బస్తాను తీసుకుపోయారు. మల్లేపల్లి, కె గోపాలపురం గ్రామాల రైతులు ఈ సొసైటీ నుంచే ఎరువులు తీసుకెళతారు. అయితే సొసైటీలో 225 యూరియా బస్తాలు స్టాక్ ఉన్నప్పటికి 113 మంది రైతులకు మాత్రమే సిబ్బంది అందజేశారు. ఆధార్, పాస్‌బుక్ జిరాక్స్ తెచ్చుకున్న రైతులకు ఒక్క బస్తా మాత్రమే ఇస్తామని సొసైటీ సిబ్బంది చెప్పడంతో రైతులు ఆవేదనకు గురయ్యారు. ఒక దశలో వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కె గోపాలపురం రైతు కర్రి రామకృష్ణ పొలం జగ్గంపేట మండలంలో మల్లిశాలలో ఉండటంతో శుక్రవారం మల్లేపల్లి సొసైటీకి యూరియా కోసం వచ్చాడు. అయితే అతనికి యూరియా ఇచ్చేది లేదని సిబ్బంది చెప్పడంతో రైతు వాపోయాడు. మల్లేపల్లి సొసైటీలోనే గతంలోను ఎరువులు తీసుకువెళ్లానని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. యూరియా పంపిణీపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సొసైటీ సిబ్బంది తమకు కావాల్సినవాళ్లకే ఇచ్చారని ఆరోపిస్తున్నారు. సొసైటీలో 225 బస్తాల యూరియా స్టాక్‌ను కేవలం 113 మంది రైతులకు పంచయేడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.