
వాన నీటిని సద్వినియోగం చేసుకోవాలి
కలెక్టర్ మహేష్ కుమార్
అమలాపురం రూరల్: మానవ మనుగడలో నీటి సంరక్షణకు ఎంతో ప్రాధాన్యం ఉందని, వర్షపు నీటిని నిల్వ చేసి, వ్యవసాయానికి, తాగునీటి అవసరాలకు సమృద్ధిగా వినియోగించుకోవాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జలవనరులు, భూగర్భ జల శాఖ, గ్రామీణ నీటి సరఫరా పారిశుధ్య విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించి జల సంరక్షణ, మైనర్ ఇరిగేషన్ చెరువుల మరమ్మతులు పూడికతీతలు, పునరుద్ధరణ, చెరువుల పునరుద్ధరణ ద్వారా ప్రస్తుతం పొందుతున్న లబ్ధికి అదనపు లబ్ధి చేకూరే దిశగా కార్యాచరణ రూపకల్పన అంశాలపై ఆయన సమీక్షించారు. ప్రభుత్వ మార్గ దర్శకాలకు అనుగుణంగా మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల నవీనీకరణకు వారం రోజుల్లో 29 పనులకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. అలాగే గ్రామీణ నీటి సరఫరా పారిశుధ్య విభాగం ఆధీనంలో ఉన్న 17 తాగునీటి నిల్వ చెరువుల అభివృద్ధి ద్వారా అదనంగా లబ్ధి చేకూరేలా ప్రతిపాదనలు రూపొందించాలని పేర్కొన్నారు. జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటినట్లు గుర్తించిన 4 గ్రామాలలో రీచార్జికి ప్రతిపాదనల రూపొందించాలన్నారు. కార్యక్రమంలో జలవరుల శాఖ ఎస్‌ఈ గోపీనాథ్, డీఈ వెంకటే శ్వరరావు, సీపీవో మురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పింఛన్ల పంపిణీకి పటిష్ట చర్యలు
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీకి పటిష్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఎంపీడీవోలను, నియోజకవర్గం ప్రత్యేక అధికారులను, తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి 22 మండలాల ఎంపీడీవోలు తహసీల్దార్లు, మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పింఛన్లు పంపిణీ, భారీ వర్షాలు వరదలను ఎదుర్కొనేందుకు సన్నద్ధతపై దిశా నిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీ శనివారం బ్యాంకుల నుంచి పింఛన్ల సొమ్మును విత్‌డ్రా చేసి సోమవారం ఉదయాన్నే పంపిణీ చేయాలన్నారు. సెప్టెంబరు మూడు నాలుగు తేదీలలో వినాయక నిమజ్జనాలు నిర్వహిస్తారని ఉత్సవ కమిటీలు ముందుగా సూచించిన నిమజ్జన ప్రాంతాలలో ఉత్సవ విగ్రహాలను బట్టి క్రేన్లు, ట్రాక్టర్ల ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ కె.మాధవి, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ కేశవ వర్మ, డీఆర్‌డీఏఏ పీడీ గాంధీ, డీఎంఅండ్ హెచ్‌ఓ ఎం.దుర్గారావు దొర, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ పద్మనాభం పాల్గొన్నారు.