
పింఛన్లు తొలగించి పొట్ట కొట్టొద్దు
రామచంద్రపురం: ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వేలాది మంది వికలాంగులు, వృద్ధులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారని, తొలగించిన పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు పలివెల రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పింఛన్ల జాబితాలను కత్తిరించి, అనేక మందికి పింఛన్లు నిలిపివేయడం క్రూరమైన చర్య అని, ఇది దివ్యాంగుల హక్కులపై దాడేనని ఆయన మండిపడ్డారు. రామచంద్రపురం ఆర్డీఓ కార్యలయం వద్ద గురువారం దివ్యాంగుల సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పింఛన్ హక్కు–మాకెందుకు కత్తిరింపు?, పింఛన్ తొలగించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలివెల రాజు, దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు ముత్యాల పోసి కుమార్, పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్ధూ తదితరులు మాట్లాడుతూ పింఛన్ రద్దుతో వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు రోడ్డున పడ్డారని, సరైన ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండా పింఛన్లు ఆపడం క్రూరమైన నిర్ణయమని అన్నారు. రూ.మూడు వేల పింఛన్ మొత్తాన్ని రూ.ఆరు వేలకు పెంచితే కూటమి ప్రభుత్వ నాయకులకు క్షీరాభిషేకం చేశారని, 15 నెలల తిరగక ముందే అనర్హత పేరుతో లక్ష మందికి పైగా దివ్యాంగుల పెన్షన్ తొలగించడం అన్యాయం అన్నారు. దివ్యాంగులకు శాతాన్ని బట్టి ప్రభుత్వాలు పెన్షన్లు, సంక్షేమ పథకాలు, బ్యాక్‌లాగ్ పోస్టులు ఇస్తున్నారని. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం నుండి బయటకు పోవడానికి కుట్ర పూరితంగా అనర్హత పేరుతో తొలగించిందన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీఓ అఖిలప్రియకు సమర్పించారు.
ఆర్డీఓ కార్యాలయం దివ్యాంగుల ధర్నా