
జూదాలు, మద్యానికి అలవాటుపడి చోరీలు
రాజోలు: వేర్వేరు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్, చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి నుంచి 172 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు. వీరిపై రాజోలు పోలీసు స్టేషన్‌లో రెండు, నగరం, మలికిపురం, రావులపాలెం, ముదినేపల్లి పోలీసు స్టేషన్లలో ఒక్కొక్కటి చొప్పున కేసులు ఉన్నాయన్నారు. స్థానిక సీఐ కార్యాలయంలో ఈ మేరకు సీఐ టీవీ నరేష్ కుమార్ వివరాల మేరకు గురువారం రాజోలు మండలం శివకోటి గ్రామం వై జంక్షన్ వద్ద వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ కేసులో ముద్దాయిలు భీమవరం టౌన్‌కు చెందిన పోలిశెట్టి పాండురంగారావు అలియాస్ పండు, అలియాస్ రంగా, ఏలూరు జిల్లా కలిదిండికి చెందిన లంక మురళీకృష్ణలను అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు. రికవరీ చేసిన సొత్తు విలువ రూ.17.30 లక్షలు ఉంటుందన్నారు. పాండురంగారావు భీమవరంలో అమృత టిఫిన్ సెంటర్ నడుపుతూ, పేకాట, క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని దొంగతనాలకు పాల్పడ్డాడని, మురళీకృష్ణ కలిదిండిలో సినీ ఆర్కెస్ట్రాలో రిథం ప్యాడ్స్ కొడుతూ జీవిస్తూ, కాలక్రమంలో ప్రోగ్రామ్స్ లేక పాండురంగారావు వద్ద పనిచేస్తూ, అతడితో కలిసి పేకాట, మద్యానికి అలవాటు పడి, సులభంగా డబ్బు సంపాదించాలన్న తపనతో దొంగతనాలకు పాల్పడినట్టు వెల్లడించారు. చోరీ కేసు ఛేదించడంలో కృషి చేసిన వివిధ విభాగాల వారిని ఎస్పీ అభినందించారు. రాజోలు ఎస్సై బీ.రాజేష్ కుమార్, క్రైమ్ కానిస్టేబుల్స్ అర్జున్, సాయి, హరి, ప్రసాద్ పాల్గొన్నారు.
● ఇద్దరి అరెస్టు ● రూ.17.3 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం