
శెట్టిబలిజ కుల ధ్రువీకరణల్లో గౌడ పేరు తొలగించాలి
అమలాపురం టౌన్: శెట్టిబలిజ కుల ధ్రువీకరణ పత్రాల్లో గౌడ్ పేరును తొలగించాలని డిమాండ్ చేస్తూ కోనసీమ శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘ నాయకులు అమలాపురంలో సోమవారం నిరసన తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లో జరుగుతున్న ప్రజా సమస్య పరిష్కార వేదికలో కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్‌కు ఎమ్మెల్సీ, ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టిబలిజ మహానాడు కన్వీనర్ కుడుపూడి సూర్యనారాయణరావు, కోనసీమ శెట్టిబలిజ నాయకులు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. తొలుత అమలాపురంలోని వాసర్ల గార్డెన్ వద్ద నుంచి బైక్ ర్యాలీ నిర్వహిస్తూ కలెక్టరేట్ వద్దకు చేరుకునున్నారు. అనంతరం ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు, కోనసీమ శెట్టిబలిజ సంఘ అధ్యక్షుడు మట్టపర్తి మీరా సాహెబ్‌శెట్టి, శెట్టిబలిజ యువత అధ్యక్షుడు గుత్తుల శ్రీను, శెట్టిబలిజ సంఘాల నేతలు చెల్లుబోయిన శ్రీనివాసరావు, మట్టపర్తి నాగేంద్ర, సంసాని బులినాని తదితరులు జిల్లా కలెక్టర్‌ను కలసి తమ డిమాండ్‌ను వివరించారు. శెట్టిబలిజ కులస్తులు బీసీ–బీ కుల కేటగిరీలోనే ఉండి రిజర్వేషన్లు పొందుతున్నారని మీరా సాహెబ్‌శెట్టి అన్నారు. అయితే జీఓఎంఎస్ నంబర్ 16 ద్వారా 1997 యాక్ట్ నంబర్ 16ఎఫ్ 1993 ప్రకారం శెట్టిబలిజ కులం పేరు ముందు గౌడ అని చేర్చి కుల ఽధ్రువీకరణ పత్రాలను అధికారులు ఇస్తున్నారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం సుమోటో కాస్ట్ సర్టిఫికెట్ మంజూరు చేసే ప్రక్రియలో గౌడ (శెట్టిబలిజ బీసీ–బీ)గా కుల ధ్రువీకరణ పత్రాన్ని ఇస్తున్నారని కలెక్టర్‌కు వివరించారు. ఈ సమస్యపై సమగ్ర విచారణ జరిపి తమకు శెట్టిబలిజ బీసీ–బీగానే కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని కోరుతున్నామని పేర్కొన్నారు. అమలాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, అమలాపురం, అల్లవరం ఎంపీపీలు కుడుపూడి భాగ్యలక్ష్మి, ఇళ్ల శేషగిరిరావు, మున్సిపల్ కౌన్సిలర్లు గొవ్వాల రాజేష్, చిట్టూరి పెదబాబు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కుడుపూడి బాబు, కోనసీమ శెట్టిబలిజ సంఘాల నాయకులు బొక్కా ఆదినారాయణ, గుత్తుల చిరంజీవిరావు, విత్తనాల శేఖర్, కుడుపూడి భరత్‌భూషణ్ పాల్గొన్నారు. కోనసీమ శెట్టిబలిజ సంఘం అందించిన వినతి పత్రంతో జిల్లా ఉన్నతాధికారులు స్పందించారు. సుమోటో కాస్ట్ సర్టిఫికెట్ల జారీని తాత్కాలికంగా నిలిపివేయాలని కోనసీమలోని తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేయడం కొసమెరుపు.