
సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి
అమలాపురం రూరల్: ప్రజా సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ గోదావరి భవన్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 190 అర్జీలను అధికారులతో కలసి కలెక్టర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. వీటిపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జేసీ నిషాంతి మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని అన్నారు. డీఆర్వో కె.మాధవి, డ్వామా పీడీ ఎస్.మధుసూదన్, సమగ్ర శిక్ష ఏపీసీ జి.మమ్మీ, డీఎల్‌డీఓలు రాజేశ్వరరావు, త్రినాథరావు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 23 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 23 అర్జీలు వచ్చాయి. ఎస్పీ బి.కృష్ణారావు నిర్వహించిన ఈ పోలీస్ గ్రీవెన్స్‌కు జిల్లాలోని పలుచోట్ల నుంచి అర్జీదారుల వచ్చి తమ సమస్యలపై ఫిర్యాదు అందజేశారు. ప్రతి అర్జీని ఎస్పీ స్వయంగా పరిశీలించి వారి సమస్యలకు పరిష్కార మార్గాన్ని సూచిస్తూ ఆయా పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్సైలకు ఆదేశాలు ఇచ్చారు. వచ్చిన అర్జీల్లో సగం వరకూ కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలకు సంబంధించిన ఫిర్యాదులే ఉండడంతో వారితో ఎస్పీ ముఖాముఖీ మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపాలి