
భక్తులతో రత్నగిరి కిటకిట
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయం సోమవారం వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. దీంతో స్వామివారి ఆలయ ప్రాంగణం, క్యూ లైన్లు, వ్రత మండపాలు భక్తులతో నిండిపోయాయి. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించి పూజలు చేశారని అధికారులు తెలిపారు. స్వామివారి వ్రతాలు 1,500 జరిగాయి. స్వామివారి దర్శనానికి రెండు గంటలు, రూ.200 టిక్కెట్‌తో అంతరాలయం దర్శనానికి గంట సమయం పట్టింది. సత్యదేవుడిని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి శ్రీకృష్ణుడిని దర్శించుకున్నారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి పూజలు చేశారు. సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది భోజనం చేశారు. కాగా ముత్యాల కవచాల అలంకరణలో స్వామి, అమ్మవారు భక్తులకు కనువిందు చేశారు.
సత్యదేవుని భక్తుల కోసం రెండు హెలికాఫ్టర్ ఫ్యాన్లు
అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి పెద్దాపురానికి చెందిన శ్రీలలితా రైస్ ఇండస్ట్రీ ఎండీ మట్టే సత్యప్రసాద్, సూర్యకమల దంపతులు రూ.నాలుగు లక్షలు విలువ చేసే రెండు హెచ్‌వీఎల్‌ఎస్ (హై వాల్యూమ్ లో స్పీడ్) ఫ్యాన్లను అందజేయనున్నారు. ఏడు మీటర్లు వ్యాసం కలిగిన ఈ ఫ్యాన్లను హెలికాప్టర్ ఫ్యాన్లుగా పిలుస్తారు. సోమవారం ఆలయానికి వచ్చిన దాత సత్యప్రసాద్ వారం రోజుల్లో వార్షిక కల్యాణ మండపంలో భక్తుల కోసం ఈ ఫ్యాన్లును అమర్చనున్నట్లు అధికారులకు తెలిపారు.