
పోటీతత్వం పెంచేందుకు సర్వే
అమలాపురం రూరల్: పరిశ్రమల పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం సృష్టించేందుకు, వివిధ రాష్ట్రాల మధ్య పోటీతత్వాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ సర్వే నిర్వహిస్తోందని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అన్నారు. సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లో ఆమె అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. కమిషనరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన అధికారి నరేంద్ర కుమార్ ఈ సర్వే విధి విధానాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు. వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా సేవలు పొందిన వారి నుంచి ప్రజాభిప్రాయాన్ని క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి నమోదు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి అరుణ, సహాయ సంచాలకులు శివరాం ప్రసాద్, పరిశ్రమల ప్రోత్సాహక అధికారి మాధురి పాల్గొన్నారు.