
భజే గణనాయకా..
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వర స్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున స్వామివారికి ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకాలు, ఏకాదశ, లఘున్యాస పూర్వక అభిషేకాలు, శ్రీలక్ష్మీ గణపతి హోమం, గరిక పూజ జరిపారు. అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మహా నివేదన సమర్పించారు. లఘున్యాస ఏకాదశ రుద్రాభిషేకాల్లో 33 మంది, పంచామృతాభిషేకాల్లో ఒక జంట, లక్ష్మీగణపతి హోమంలో 17 జంటలు పాల్గొన్నాయి. చిన్నారులకు నామకరణలు, అన్నప్రాశనలు జరిగాయి. 19 మంది వాహన పూజలు చేయించుకున్నారు. 2,140 మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. ఆదివారం ఒక్క రోజు వివిధ విభాగాల రూ.1,28,346 ఆదాయం లభించినట్లు ఆలయ ఇన్‌చార్జ్ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని తెలిపారు.
ఉచితంగా మట్టి విగ్రహాల పంపిణీ
చవితి మహోత్సవాల సందర్భంగా అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ అల్లు వెంకట దుర్గాభవాని, సర్పంచ్ కాకర శ్రీనివాస్‌లు ఆలయం తరఫున భక్తులకు మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు ఎంత మంది ఉంటే అంతమందికి మట్టి గణపతి విగ్రహాలను ఇస్తామని ఈఓ తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు వివరించారు.