
గ్రాండ్ ప్రిక్స్ బ్యాడ్మింటన్ న్యాయనిర్ణేతగా పాయసం
అమలాపురం టౌన్: పూణేలో ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకూ జరిగే ఇండియా జూనియర్ ఇంటర్నేషనల్ గ్రాండ్ ప్రిక్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు న్యాయనిర్ణేతగా అమలాపురం పట్టణం కొంకాపల్లికి చెందిన ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పాయసం శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి శ్రీనివాసరావు నియామక ఉత్తర్వులు అందుకున్నారు. గ్రేడ్ వన్ నేషనల్ అంఫైర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు ప్రస్తుతం అయినవిల్లి మండలం నల్లచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీడీగా విధులు నిర్వహిస్తున్నారు. శ్రీనివాసరావు ఇప్పటికే థామస్ ఉబెర్ కప్, వరల్డ్ స్కూల్ గేమ్స్ చాంపియన్ షిప్, ఇండియా ఓపెన్, ఖేలో ఇండియా, నేషనల్ గేమ్స్, నేషనల్ చాంపియన్ షిప్, ఆల్ ఇండియా ర్యాంకింగ్ టోర్నమెంట్, సీబీఎస్‌ఈ నేషనల్ వంటి పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్‌లకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో క్రీడాకారుల ఎదుగుదలకు ఎంతో ముఖ్యమైన ఇండియా జూనియర్ ఇంటర్నేషనల్ గ్రాండ్ ప్రిక్స్ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు న్యాయ నిర్ణేతగా ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ అంకమ్మ చౌదరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అసోసియేషన్ సెక్రటరీ కొత్తపల్లి బాలు, డీఈఓ డాక్టర్ షేక్ సలీమ్‌బాషా, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పి.సురేష్‌కుమార్‌లు పీడీ శ్రీనివాసరావును అభినందించారు.
నేటి నుంచి వాలీబాల్ టోర్నమెంట్
అమలాపురం టౌన్: గ్రామీణ బాల బాలికల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు జిల్లాలోని 66 ఉన్నత పాఠశాలల్లో వాలీబాల్ టోర్నమెంట్‌లను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు నిర్వహిస్తుందని ఆ అసోసియేషన్ అధ్యక్ష, కార్యనిర్వాహక కార్యదర్శులు అల్లాడ శరత్‌బాబు, పప్పుల శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. ఆయా పాఠశాలల స్థాయిలోనే పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. విజేతలకు అమలాపురం కిమ్స్ ఆస్పత్రి, వైద్య కళాశాల యాజమాన్యం పతకాలు, సర్టిఫికెట్లను సమకూర్చుతోంది. ఇందుకోసం 2,164 బంగారు, వెండి పతకాలను సిద్ధం చేసింది. ప్రతి పాఠశాలలో మూడు స్థాయిల్లో పోటీలు జరుగుతాయి. విన్నర్స్, రన్నర్స్‌గా విజేతలను ఎంపిక చేసి పతకాలను ఈ నెల 29వ తేదీ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆయా పాఠశాలల్లోనే ప్రదానం చేస్తారని శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. ఈ నాలుగు రోజులు క్రీడాకారులకు భోజన సదుపాయం కూడా కిమ్స్ ఏర్పాటు చేసిందన్నారు. పోటీల్లో అత్యుత్తుమ ప్రతిభ కనబరిచిన 30 క్రీడాకారులను (15 మంది బాలలు, 15 మంది బాలికలు) ఎంపిక చేస్తామని, వారికి అమలాపురం కిమ్స్ సౌజన్యంతో ప్రత్యేక శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేసి, జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దనున్నామని శ్రీరామచంద్రమూర్తి వెల్లడించారు.
నేడు ప్రజా సమస్యల
పరిష్కార వేదిక
అమలాపురం రూరల్: జిల్లా స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం ఉదయం 10 గంటల నుంచి అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవన్‌లో నిర్వహిస్తామని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి పరిష్కార మార్గాలు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా స్థాయితోపాటు మూడు రెవెన్యూ డివిజనల్ అధికారుల కార్యాలయాల్లో మండల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కార్యాలయాల్లో గ్రీవెన్స్ జరుగుతుందన్నారు.
రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీకి చర్యలు
అమలాపురం రూరల్: వచ్చే నెల 6వ తేదీ క్యూఆర్ కోడ్ బేస్డ్ స్మార్ట్ బియ్యం కార్డుల పంపిణీకి రంగం సిద్ధం చేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రేషన్ లబ్ధిదారులకు పంపిణీ చేసిన రేషన్ గుర్తింపు కార్డుల స్థానంలో కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 5,31,926 మంది రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్డు ముందు వైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం, కుటుంబ పెద్ద చిత్రం, రేషన్ దుకాణం సంఖ్య, క్యూఆర్ కోడ్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయన్నారు. ఈ–పోస్ నూతన యంత్రాల సాయంతో కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కుటుంబానికి సంబంధించి తీసుకునే సరకుల వివరాలను కనిపించేలా కార్డును డిజైన్ చేశారన్నారు. కుటుంబ పెద్ద ఫొటో, కుటుంబ సభ్యుల పేర్ల వివరాలు, దీని ద్వారా లబ్ధిదారుల గుర్తింపు మరింత తేలిక అవుతుందన్నారు. ఇప్పటికీ పాత కార్డులు పొందిన వారితో సహా కొత్త వారికి కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారన్నారు. వీటి ఆధారంగా లబ్ధిదారులు సెప్టెంబర్ నుంచి రేషన్ సరకులు పొందుతారని డీఎస్వో తెలిపారు.