
తేరుకుంటున్న లంకలు
పి.గన్నవరం: గోదావరి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పడుతుండడంతో లంకలు తేరుకుంటున్నాయి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద శనివారం మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దిగువకు వస్తున్న నీరు క్రమేపీ తగ్గుతోంది. వశిష్ట, వైనతేయ నదీపాయల్లో వరద ఉధృతి క్రమేపీ నెమ్మదించింది. దీంతో లంక గ్రామాలకు రాకపోకలు ప్రారంభమయ్యాయి. అయితే మానేపల్లి శివారు శివాలయంకకు వెళ్లే రహదారి మాత్రం వరద ముంపులోనే ఉండటంతో రెండు కిలోమీటర్ల మేర ఆ గ్రామ ప్రజలు ట్రాక్టర్‌పైనే వెళ్తున్నారు. మండలంలోని ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల ప్రజలతో పాటు, జిల్లాకు సరిహద్దులో ఉన్న పెదమల్లంక, ఆనగర్లంక, సిర్రావారిలంక, అయోధ్యలంక గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. చాకలిపాలెం శివారు కనకాయలంక కాజ్‌వేపై ఇంకా వరద ఉధృతి కొనసాగుతోంది. లంక భూముల్లోని పంటలన్నీ వరద నీట మునిగి పాడైపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరద తగ్గి రేవులో బురద పేరుకుపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.