విద్యారంగ సమస్యలపై 25న చలో కలెక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యారంగ సమస్యలపై 25న చలో కలెక్టరేట్‌

Aug 23 2025 1:58 AM | Updated on Aug 23 2025 1:58 AM

విద్యారంగ సమస్యలపై 25న చలో కలెక్టరేట్‌

విద్యారంగ సమస్యలపై 25న చలో కలెక్టరేట్‌

కాకినాడ సిటీ: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన తలపెట్టిన చలో కలెక్టరేట్‌ కార్యక్రమ పోస్టర్‌ను శుక్రవారం స్థానిక పీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద సంఘ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.శ్రీకాంత్‌, ఎం.గంగాసూరిబాబు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తున్నాయని విమర్శించారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్యను అందించాల్సిన ప్రభుత్వాలు.. విద్యను అందని ద్రాక్షగా తయారు చేస్తున్నాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి.. నేడు విద్యారంగాన్ని కనీసం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నూతన జాతీయ విద్యావిధానం పేరు చెప్పి విద్యను మొత్తం ప్రైవేటీకరణ, కేంద్రీకరణ, కషాయీకరణ చేస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రభుత్వ విద్యారంగంలోని పెండింగ్‌లో ఉన్న రూ.64 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. జీవో నంబర్‌ 77ను రద్దు చేసి, ప్రైవేట్‌ కాలేజీలో పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని వర్తింపజేయాలని చెప్పారు. హాస్టల్‌ విద్యార్థులకు మెస్‌ చార్జీలు రూ.3 వేలకు పెంచి, హాస్టల్‌కు శాశ్వత భవనాలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. విద్యాసంస్థలకు గుదిబండగా ఉన్న జీవో నంబర్‌ 42, 35ను రద్దు చేసి, కళాశాలల్లో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు పుస్తకాలు, మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయాలని కోరారు. తల్లికి వందనం అందరికీ ఇవ్వాలని, విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని, విద్యార్థులందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో విద్యార్థులను ఐక్యం చేసి, ఉధృత పోరాటం చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నగర అధ్యక్షుడు ఎ.వాసుదేవ్‌, జిల్లా కమిటీ సభ్యులు చిన్ని, జైశ్రీరామ్‌, నగర నాయకులు సత్యం, ఆదర్శ్‌కార్తీక్‌, తేజ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement