
నమ్మబలికి..
● దివ్యాంగులకు
కూటమి సర్కార్ వంచన
● పరిశీలన పేరుతో వారి పింఛన్లకు కత్తెర
● అనేక మంది కోల్పోయిన జీవనాధారం
● జిల్లావ్యాప్తంగా
2,899 మందికి నిలుపుదల
● ప్రభుత్వానికి బాధితుల శాపనార్థాలు
గత ప్రభుత్వ వెన్నుదన్నుతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని.. సమాజంలో తమకంటూ ప్రత్యేక గౌరవాన్ని సాధించిన దివ్వాంగులకూ కూటమి ప్రభుత్వ వంచన ఎదుర్కొనక తప్పడం లేదు. దివ్యాంగులను అందలం ఎక్కిస్తామంటూ సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి ‘పెద్దలు’ అరచేతిలో వైకుంఠం చూపించి నమ్మబలికారు. తీరా అధికారం చేపట్టాక.. ఒక్కొక్క
సంక్షేమ పథకాన్నీ నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా దివ్యాంగుల పింఛన్లపై కన్నేసింది.
రాజోలు: ప్రభుత్వం ద్వారా ప్రతి నెలా వచ్చే పింఛను సొమ్ముతో పోషణకు విఘాతం లేకుండా ఆత్మగౌరవంతో జీవనం సాగిస్తున్న దివ్యాంగులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు తెర తీసింది. దివ్యాంగుల పింఛన్ల పరిశీలన పేరుతో కూటమి ప్రభుత్వం.. అధిక సంఖ్యలో వారి పింఛన్లకు కత్తెర వేసింది. తమ పింఛను ఆగిపోయిందని తెలిసిన దివ్యాంగులు సచివాలయం, మండల పరిషత్ కార్యాలయాలకు చేరుకుని కంటతడి పెట్టుకుంటున్నారు. తమ పింఛను తొలగించవద్దంటూ అధికారులను ప్రాధేయపడుతున్నారు. వైకల్యం, కంటిచూపు, వినికిడి, వివిధ రకాల మానసిక రుగ్మతలతో అనేక మంది దివ్యాంగులు ప్రతి నెలా పింఛను అందుకుంటున్నారు. ఈ డబ్బే వారికి పూర్తి జీవనాధారం. అంతేకాకుండా కుటుంబ పోషణకు చేతనైన సాయం వారు అందిస్తున్నారు. పింఛను రద్దుతో కుటుంబంలో తమపై చీదరింపులు, ఛీత్కారాలు తప్పవని దివ్యాంగులకు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పదేళ్లకు పైబడి అంగవైకల్య ధ్రువీకరణ పత్రంతో పింఛను అందుకుంటున్న అనేక మందికి.. పరిశీలన పేరుతో వైకల్య శాతం తగ్గించి పింఛన్లు నిలిపివేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏనాడూ, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పింఛను అందుకునే వారమని ఈ సందర్భంగా పలువురు దివ్యాంగులు వ్యాఖ్యానిస్తున్నారు.
శాపంగా మారిన పునః పరిశీలన
కూటమి ప్రభుత్వం లేనిపోని నిబంధనలతో దివ్యాంగుల పింఛన్లను తగ్గించేందుకు పునః పరిశీలన పేరుతో సదరం సర్టిఫికెట్ల తనిఖీని ప్రభుత్వాస్పత్రిల్లో ప్రత్యేక వైద్య బృందాల పేరుతో నిర్వహించారు. గతంలో ముగ్గురు సభ్యుల వైద్యుల బృందం ఇచ్చిన సదరం సర్టిఫికెట్‌లో అంగ వైకల్యం శాతాన్ని ఇప్పుడు తగ్గించేశారు. 90 శాతం ఉంటే 56 శాతానికి, 55 ఉంటే 44కు, 44 ఉంటే 35 శాతానికి కుదించారు. దీంతో అనేక మంది దివ్యాంగుల అంగ వైకల్యశాతం 40 శాతానికి తగ్గిపోవడంతో పింఛన్లు పొందేందుకు అనర్హులుగా కూటమి ప్రభుత్వం ప్రకటించింది. వైకల్య శాతం తగ్గించిన కారణంగా పింఛను మాటెలా ఉన్నా, కొన్ని రాయితీలు, ఉద్యోగ రిజర్వేషన్లలో అనేక మంది దివ్యాంగులు నష్టపోయే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి.
సెప్టెంబరు నుంచి నిలుపుదల
పునఃపరిశీలనలో అంగవైకల్యం 40 శాతం కంటే తక్కువగా గుర్తించిన వారికి ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి పింఛను నిలుపుదల చేస్తున్నట్టు ఇప్పటికే జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు వెల్లడించారు. పింఛను కోల్పోయిన దివ్యాంగులు ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లకు 30 రోజుల్లోగా ఆప్పీళ్లు చేసుకుంటే, మళ్లీ వైద్య పరీక్షలకు సిఫార్సు చేసి పింఛను మంజూరు చేస్తామంటున్నారు. జిల్లావ్యాప్తంగా 32,101 మంది దివ్యాంగులు పింఛన్లు పొందుతున్నారు. కదల్లేని స్థితిలో 16,934 మంది ఉండగా, దృష్టి లోపం 4,036 మంది, వినికిడి లోపం 3,992 మంది కాగా, మానసిక వైకల్యం 3,751 మంది. మానసిక అనారోగ్యం 1,277 మంది ఉండగా, వివిధ బహుళ వైకల్యం 2,111 మంది వరకున్నారు. ఇటీవల వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వీరి గుర్తింపుపై సర్వే నిర్వహించారు. ఇంతవరకు 24,213 మంది పింఛన్ల పునః పరిశీలన పూర్తయింది. ఇంకా 7,888 మంది దివ్యాంగుల పింఛన్లను పరిశీలించాల్సి ఉంది. ఇప్పటివరకు 2,899 మంది పింఛన్లను నిలుపుదల చేశారు. అలాగే అంగవైకల్యం 40 శాతం కంటే తక్కువగా ఉన్న 652 మందిలో 60 ఏళ్లు దాటిన వారికి వృద్ధాప్య, భర్త చనిపోయిన దివ్యాంగ మహిళలకు వితంతు పింఛన్లుగా మార్పు చేసి, గతంలో పొందిన రూ.6 వేల పింఛనును రూ.4 వేలకు కుదించారు. పూర్తిగా మంచానికే పరిమితమైన దివ్యాంగులకు రూ.15 వేలు అందిస్తున్న పింఛనును వైకల్య శాతం కుదించి రూ.6 వేలు, రూ.4 వేలకు మార్చేశారు. దీంతో ప్రతి నెలా రూ.15 వేలు అందుకుంటున్న వారు రూ.6 వేలు, రూ.4 వేలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. వీరిలో 60 ఏళ్లు దాటిన వారికి కంటి తుడుపు చర్యగా 321 మందికి వృద్ధాప్య, వితంతు పింఛన్లు అందజేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
కూటమి ప్రభుత్వ కక్ష
దివ్యాంగులపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. అనర్హుల ఏరివేత పేరుతో అర్హులైన దివ్యాంగులు వేల మందిని రాష్ట్రవ్యాప్తంగా తొలగించింది. ఓవైపు పింఛన్లు పెంచి, మరోవైపు తొలగించి దివ్యాంగ కుటుంబాలను రోడ్డున పడేయడం న్యాయం కాదు. పింఛను ఒక్కటే కాదు, రాబోయే రోజుల్లో ఉపాధి, సంక్షేమ, ఉద్యోగావకాశాలూ దివ్యాంగులు కోల్పోవచ్చు.
– ఖండవిల్లి భరత్‌కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక

నమ్మబలికి..