
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కలెక్టర్ మహేష్‌కుమార్
మామిడికుదురు: గోదావరి వరద దృష్ట్యా నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ హెచ్చరించారు. గురువారం ఆయన అప్పనపల్లి కాజ్‌వే వద్ద వరద ఉధృతిని పరిశీలించారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని, అధికారుల హెచ్చరికలకు అనుగుణంగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలన్నారు. సహాయక చర్యలకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని నిర్దేశించారు. వరద ఉధృతి పెరిగే పక్షంలో కొన్ని ప్రాంతాల్లో రోడ్లు ముంపు బారిన పడి, రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలన్నారు. ముంపు బాధితుల తరలింపు, పునరావాస కేంద్రాల నిర్వహణపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సన్నద్ధం కావాలని సూచించారు. ఆయన వెంట మండల ప్రత్యేకాధికారి వేణుగోపాల్, తహసీల్దార్ పి.సునీల్‌కుమార్, ఇన్‌చార్జి ఎంపీడీఓ అడబాల శ్రీనివాస్, ఇతర అధికారులు ఉన్నారు.