
శాస్త్రోక్తంగా లక్ష రుద్రాక్ష పూజ
ఐ.పోలవరం: నిత్య కల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామివారికి గురువారం లక్ష రుద్రాక్ష పూజా మహోత్సవం అత్యంత శాస్త్రోక్తంగా జరిగింది. శ్రావణ మాసం మాస శివరాత్రి మహా పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు యనమండ్ర సత్య సీతారామ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 15 మంది రుత్విక్‌లు కార్యక్రమంలో పాల్గొన్నారు. వారణాసి నుంచి తెచ్చిన రుద్రాక్షలను మేళతాళాలతో గ్రామోత్సవం జరిపి, గోదావరి వద్ద ప్రత్యేక పూజలు, సంప్రోక్షణ చేశారు. 728 మంది భక్తులు గోత్ర నామాలు నమోదు చేసుకున్నారు. ఆలయ సహాయ కమిషనర్, కార్య నిర్వాహణాధికారి వి.సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులకు అల్పాహారం, అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. కార్యక్రమం తిలకించేందుకు భారీ ఎల్‌ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. భక్తులకు రుద్రాక్షలు ప్రసాదంగా అందజేశారు.