శాంతించని గోదావరి | - | Sakshi
Sakshi News home page

శాంతించని గోదావరి

Aug 21 2025 7:16 AM | Updated on Aug 21 2025 7:16 AM

శాంతి

శాంతించని గోదావరి

పెరుగుతున్న వరద ఉధృతి

పొంగుతున్న డ్రైనేజీలు

ముంపు బారిన వరి చేలు

లంక గ్రామాల ప్రజల అవస్థలు

సాక్షి అమలాపురం: గోదావరి వరద తగ్గినట్టే తగ్గి ఉధృతమవుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద బుధవారం ఉదయం నుంచి స్వల్పంగా పెరుగుతోంది. ఒకవైపు వరద పెరగడం, మరోవైపు ముంపు నీరు డ్రైనేజీల నుంచి కిందకు దిగే అవకాశం లేకపోవడంతో చివరిలో వరి చేలు ముంపు బారిన పడి చెరువులను తలపిస్తున్నాయి. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి మంగళవారం సాయంత్రం ఆరు గంటలకు 7,40,587 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా, బుధవారం ఉదయం ఆరు గంటలకు వరద 7,38,187 క్యూసెక్కులకు తగ్గింది. తిరిగి ఉదయం 8 గంటలకు 7,40,578 క్యూసెక్కులకు పెరిగింది. తర్వాత కూడా గోదావరి వరద స్వల్పంగా పెరుగుతూ వస్తోంది. సాయంత్రం ఏడు గంటలకు 8,20,677 క్యూసెక్కుల వరద నీటిని దిగువునకు విడుదల చేశారు.

మునిగిన కాజ్‌వే...

వరద ప్రభావంతో పి.గన్నవరం సరిహద్దు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే కనకాయలంకకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ గ్రామంలోకి వెళ్లే కాజ్‌వే పూర్తిగా నీట మునిగింది. దీనితో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా పడవలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే పి.గన్నవరం మండలంలోని గంటి పెదపూడిలంక, ఉడుమూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంకలకు వెళ్లేందుకు అధికారులు పడవలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

లోతట్టు ప్రాంతాల్లో..

మామిడికుదురు మండలంలోని లోతట్టు ప్రాంతాల్లో నదీపాయల మధ్య ఉన్న లంకలో పశుగ్రాసాలు నీట మునిగాయి. వరద పెరుగుతున్నందున పెదపట్నంలంక, బొ.దొడ్డవరం, అప్పనపల్లి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన కాజ్‌వేపైకి వరద నీరు వచ్చే ప్రమాదముంది. అయినవిల్లి మండలం ముక్తేశ్వరం వద్ద తొగరిపాయలో వరద ఉధృతి అధికంగా ఉంది. పాత వంతెన నీట మునిగింది. ఐ.పోలవరం మండలం అన్నంపల్లి అక్విడెక్టు, పి.గన్నవరం అక్విడెక్టుల వద్ద వరద తాకుతూ ప్రవహిస్తోంది. వరదల వల్ల కోటిపల్లి, బోడసుకుర్రు, దిండి వద్ద రైల్వే వంతెన నిర్మాణ పనులకు బ్రేకులు పడ్డాయి. నది మధ్యలోని యంత్రాలను నిర్మాణ సిబ్బంది తరలించారు. జి.మూలపాలెం– గుత్తినదీవి మధ్య పడవల మీద రాకపోకలను నిలిపివేశారు.

కలెక్టర్‌ పర్యటన

ఎగువన భద్రాచలం వద్ద వరద పెరగడంతో దిగువన కోనసీమ జిల్లాలో కూడా గురువారం సాయంత్రం వరకూ ఉధృతి కొనసాగుతుంది. ఇక్కడ వరద పెరిగితే ఆ ప్రభావం జిల్లాలో 24 గంటలకు పడే అవకాశముంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ తదితరులు పర్యటించారు. అన్నంపల్లి అక్విడెక్టు వద్ద వరదను పరిశీలించిన అనంతరం సమీపంలోని ఫ్లడ్‌ స్టోరేజీలో సామగ్రి నిల్వలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు.

శాంతించని గోదావరి1
1/1

శాంతించని గోదావరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement