
మరో మూడు రోజులు రాకపోకల బంద్
అమలాపురం రూరల్: చించినాడ వంతెన మరమ్మతుల నేపథ్యంలో మరో మూడు రోజుల పాటు రాకపోకలను నిలుపుదల చేస్తున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ తెలిపారు. వెల్లడించారు. ఈ మేరకు గురువారం నుంచి శనివారం వరకూ ఉదయం 10 నుంచి రాత్రి 8 వరకూ అమల్లో ఉంటుందన్నారు. మిగిలిన సమయంలో కేవలం ద్విచక్ర వాహనాలకు
మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.
గంజాయి నిర్మూలనకు పటిష్ట నిఘా
సఖినేటిపల్లి: పోలీసు శాఖ చేపట్టిన పటిష్టమైన నిఘా చర్యలతో గంజాయి వాడకం బాగా తగ్గిందని ఏలూరు రేంజ్ ఐజీ ఆఫ్ పోలీసు జీవీజీ అశోక్ కుమార్ అన్నారు. సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం మాట్లాడుతూ గంజాయి నిర్మూలనలో భాగంగా స్థానికంగా జరుగుతున్న విక్రయాలు, పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. వినాయక చవితిని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. అనుమతించిన ప్రాంతాల్లోనే విగ్రహాల నిమజ్జనం జరపాలన్నారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ఆయన వెంట ఎస్పీ బి.కృష్ణారావు, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీ మోహన్, పలువురు సీఐలు, ఎస్సైలు ఉన్నారు.
మాకు చెప్పకుండా
ఎలా వచ్చారు!
మాల కార్పొరేషన్ చైర్మన్‌ను
నిలదీసిన జన సైనికులు
అంబాజీపేట: స్థానిక పశువుల మార్కెట్ ఆవరణలో శిథిలావస్థకు చేరుకున్న ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్‌ను పరిశీలించేందుకు బుధవారం వచ్చిన రాష్ట్ర మాల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్‌కుమార్‌కు జన సైనికుల నుంచి చుక్కెదురైంది. తమకు సమాచారం ఇవ్వకుండా ఇక్కడకు ఎలా వచ్చారంటూ ఆయనను నిలదీశారు. పర్యటన ఉందని ముందుగా చెబితే పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై, ఉండేవారని, ఎటువంటి సమాచారం లేకుండా రావడం వల్ల పార్టీలో అంతర్గత విభేదాలు చోటుచేసుకుంటాయన్నారు. దీంతో విజయకుమార్ మాట్లాడుతూ అంబాజీపేటకు చెందిన మాల మహానాడు అధ్యక్షుడు నాగవరపు నాగరాజు, నాయకులు ఈ శిథిలావస్థకు చేరిన ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ భవనాన్ని పరిశీలించేందుకు రావాలని కోరడంతో వచ్చానని చెప్పారు.
రేపు సామూహిక
ఉచిత వరలక్ష్మీ వ్రతం
అన్నవరం: శ్రావణమాసం ఐదో శుక్రవారం సందర్భంగా సత్యదేవుని సన్నిధిన ‘సామూహిక ఉచిత వరలక్ష్మీ వ్రతం’ నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం ఎనిమిది గంటలకు ఈ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. నిత్య కల్యాణ మండపంతోపాటు నాలుగు, ఐదో నంబర్ వ్రత మండపాలలో కూడా ఈ వ్రతాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. మూడు మండపాలలో వ్రతాలు నిర్వహించిన తరువాత కూడా మహిళలు ఎక్కువగా ఉంటే ఉదయం పది గంటలకు రెండో బ్యాచ్‌లో కూడా ఈ వ్రతాలు నిర్వహిస్తారు.

మరో మూడు రోజులు రాకపోకల బంద్