
ప్రిన్సిపాల్ సౌమ్య ఆత్మహత్యాయత్నానికి వారే కారణం
అమలాపురం టౌన్: ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచరులు చేసిన ఆరోపణల వల్లే శ్రీకాకుళం జిల్లా పొందూరు కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపాల్ రాజేటి సౌమ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని కుల వివక్షత పోరాట సంఘం (కేవీపీఎస్) జిల్లా కమిటీ కన్వీనర్ శెట్టిబత్తుల తులసీ దుర్గారావు అన్నారు. అమలాపురంలోని గొల్లగూడెంలో గల జిల్లా ప్రజా సంఘాల కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ఘటనపై ప్రజా సంఘాల నాయకులు చర్చించారు. దుర్గారావు మాట్లాడుతూ ప్రిన్సిపాల్ సౌమ్యకు వ్యతిరేకంగా తప్పుడు నివేదికలు ఇచ్చి, జిల్లా ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించిన ఆ జిల్లా సర్వశిక్షా అభియాన్ ఏసీపీ సంపతరావు శశిభూషణ్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. పలు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ సర్వశిక్షా అభియాన్ ఏసీపీని విధుల నుంచి తొలగించడమే కాకుండా అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ జరపాలన్నారు. సౌమ్య ఘటనపై సీబీఐచే సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రవికుమార్ అనుచరులు, సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో అసత్యాలు ప్రసారం చేస్తున్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలన్నారు. రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షుడు కారెం వెంటేశ్వరరావు మాట్లాడుతూ సౌమ్యపై ఏసీపీ ఇచ్చిన తప్పుడు నివేదికను తక్షణమే బహిర్గతం చేయాలని, ఆమె అక్రమ బదిలీని నిలిపివేయాలన్నారు. వీసీకే పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొంతు రమణ మాట్లాడుతూ ఓ మహిళకు జరిగిన అన్యాయంపై రాష్ట్ర హోంశాఖ మంత్రి ఇంకా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. దళిత మహిళా ప్రిన్సిపాల్ సౌమ్యకు జరిగిన అన్యాయంపై ప్రజా సంఘాలు మద్దతుగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా గౌరవాధ్యక్షుడు జి.దుర్గాప్రసాద్, వాకపల్లి హరీష్, కడిమి నాగరాజు, నులుకుర్తి రాముడు తదితరులు పాల్గొన్నారు.