
ప్రశాంతంగా వినాయక చవితి ఉత్సవాలు
అమలాపురం రూరల్: జిల్లాలో ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 5 వరకు జరిగే వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలపై రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, కాలుష్య నియంత్రణ, వైద్య ఆరోగ్యం, అగ్నిమాపక, పంచాయతీ, మత్స్యశాఖ, గణేశ్ ఉత్సవ సమితి కమిటీ సభ్యులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. వినాయక మంటపాల ఏర్పాటు, విగ్రహాల ప్రతిష్ట, నిమజ్జనం సందర్భంగా వివిధ ఘాట్ల వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లపై శాఖల వారీగా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ మట్టితో చేసిన విగ్రహాలను ప్రతిష్టించేలా ఉత్సవ కమిటీలు ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. గణేష్ మందిరాల ఏర్పాటుకు అధికారుల అనుమతి తప్పనిసరి అన్నారు. ఎస్పీ బి.కృష్ణారావు మాట్లాడుతూ వినాయక చవితి రోజు సుమారు 30 వేల మంది భక్తులు అయినవిల్లి వినాయక ఆలయాన్ని సందర్శిస్తారని భావిస్తున్నామన్నారు. స్వామి దర్శనం కోసం క్యూలైన్లు, పాలు, భోజనం వంటి అన్ని అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి. నిషాంతి, డీఆర్‌ఓ కొత్త మాధవి, అయినవిల్లి దేవాలయం ఈవో భవాని, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.