
మునిగిన చేలు
గోదావరి పాయలలో వరద నీరు పోటెత్తడంతో మురుగునీటి కాలువల నుంచి నీరు దిగే అవకాశం లేకుండా పోయింది. జిల్లాలో తూర్పు డెల్టా పరిధిలో తుల్యభాగ, మధ్య డెల్టా పరిధిలో గొంది, నోవా, శంకరగుప్తం, అయినాపురం, గోరగనమూడి, బండారులంక ఎగువ కౌశిక, మురమళ్లలోని డ్రైనేజీల నుంచి ముంపు నీరు నదీపాయలలోకి వెళ్లాలి. అయితే వరద పెరగడం వల్ల నదీ పాయలలో నీటి మట్టం పెరిగింది. ఈ కారణంగా డ్రైనేజీల నుంచి ముంపునీరు దిగే అవకాశం లేకపోవడానికి తోడు నది నుంచి డ్రైనేజీల ద్వారా ముంపునీరు ఎగదన్నుకుని వచ్చి చేలను ముంచెత్తుతోంది. దీనితో చేలు కాస్తా చెరువులుగా మారిపోతున్నాయి. ఐ.పోలవరం మండలంలో ఈ పరిస్థితి అధికంగా ఉంది. మండలంలోని మురమళ్లలో షటర్లు దెబ్బతినడంతో నీరు ఎగదన్ని వరద నీరు చేలను ముంచెత్తింది. ఇక్కడ సుమారు 300 ఎకరాలలో వరద నీరు చేరింది.