
జిల్లాకు 11 బార్లు మంజూరు
– ఒక్కో దానికి విధిగా 4 దరఖాస్తులు
అమలాపురం టౌన్: జిల్లాకు 11 బార్లు మంజూరైనట్టు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎస్‌కేడీవీ ప్రసాద్ తెలిపారు. అమలాపురంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో బార్ల నోటిఫికేషన్‌కు సంబంధించిన కొత్త బార్ పాలసీని వివరించారు. ఈ బార్లకు సోమవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టామని, 26వ తేదీ వరకూ కొనసాగుతుందని చెప్పారు. ఈ నెల 28 సాయంత్రం ఐదు గంటలకు అమలాపురం కలెక్టరేట్‌లో బార్లకు డ్రా తీస్తారని తెలిపారు. ప్రతి బార్‌కు కనీసం నాలుగు దరఖాస్తులు విధిగా రావాలన్నారు. అలా రాని పక్షంలో మిగతా దరఖాస్తులను పెండింగ్‌లో పెడతామని, నాలుగు దరఖాస్తులు వచ్చేవరకు డ్రా తేదీని పొడిగిస్తామన్నారు. మంజూరైన బార్లలో రెండు గీత కార్మికులకు కొత్తగా కేటాయించారని చెప్పారు. ఈసారి కొత్తగా దిండి రిసార్ట్‌కు బార్ మంజూరైందన్నారు. అమలాపురం 3, మండపేట 2, రామచంద్రపురం 2, ముమ్మిడివరం, దిండి ఒక్కొక్కటి, గీత కార్మికులకు 2 బార్లు మంజూరైనట్టు వివరించారు.