
‘కొరత’ సృష్టిస్తే కఠిన చర్యలు : కలెక్టర్
అమలాపురం రూరల్: జిల్లాలో ఎరువులు పక్కదారి పట్టిస్తూ, కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ సోమవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఖరీఫ్ పనులకు ఎరువు లు సమృద్ధిగా ఉన్నట్టు తెలిపారు. కిలో ఎరువూ పక్క దారి పట్టడానికి వీల్లేదన్నారు. ఆన్‌లైన్ రికార్డులతో ఎరువుల లెక్కలు పారదర్శకంగా ఉండాలన్నారు.
ఆరోగ్యంపై పొగాకు దుష్ప్రభావం
పొగాకు వల్ల ప్రజలకు కలిగే హృద్రోగాల దుష్ప్రభావంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టి సారించిందని కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పెద్దలకు అవగాహన కల్పించి, సంతకాలు సేకరించిన ప్రతి మండలానికి ముగ్గురు వంతున విద్యార్థులను ఎంపిక చేసి, ప్రోత్సాహకంగా కలెక్టరేట్‌లో బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సంతకాలను ప్రభుత్వాలకు, ఆరోగ్య సంస్థలకు పంపుతారని చెప్పారు. డీఎంహెచ్‌వో ఎం.దుర్గారావు దొర, పీవో డాక్టర్ ఎం.సుమలత పాల్గొన్నారు.
అర్జీలను పరిష్కరించాలి
ప్రజల నుంచి వచ్చిన అర్జీలకు నూరు శాతం నాణ్యమైన పరిష్కారాలు చూపాలని కలెక్టర్ మహేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో సుమారు 135 అర్జీలను కలెక్టర్‌తో పాటు, జేసీ టి.నిషాంతి, డీఆర్‌ఓ కె.మాధవి స్వీకరించారు. నిర్ణీత గడువులోగా అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. రీ ఓపెన్ కేసులను పూర్తిగా విచారణ జరిపి ముగించాలన్నారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం సహించేది లేదని జేసీ హెచ్చరించారు. డ్వామా పీడీ మధుసూదన్, డీఎస్‌ఓ అడపా ఉదయభాస్కర్, ఎస్‌డీసీపీ కృష్ణమూర్తి, డీఎల్‌డీవో రాజేశ్వరరావు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.