
జెండా పండగకు సర్వం సిద్ధం
● ముస్తాబైన బాలయోగి స్టేడియం
● ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం
అమలాపురం రూరల్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు జిల్లా కేంద్రమైన అమలాపురం ముస్తాబైంది. స్థానిక బాలయోగి స్టేడియంలో శుక్రవారం నిర్వహించే జెండా పండగకు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, డీఆర్వో మాధవి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం వివిధ శాఖల అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేస్తారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ను జాతీయ జెండాలు, స్వాగత తోరణాలతో సుందరంగా అలకరించారు. వేడుకలు జరిగే బాలయోగి స్టేడియంలో వేదికను అందంగా తీర్చిదిద్దారు. పోలీస్ పరేడ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలపఽథకాలతో శకటాలను సిద్ధం చేస్తున్నారు.
600 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన
అమలాపురం టౌన్: అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ (ఏబీవీపీ) అమలాపురం శాఖ ఆధ్వర్యంలో గురువారం అమలాపురంలో 600 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. వివిధ విద్యాలయాలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు భారతమాతకు జై అంటూ నినాదాలు చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యానిధి విద్యా సంస్థల చైర్మన్ ఏబీ నాయుడు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏబీవీపీ విభాగ్ కన్వీనర్ సత్య మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తిని, స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపేందుకు ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ర్యాలీకి ఏబీవీపీ రాష్ట్ర స్టూడెంట్ ఫర్ డెవలప్‌మెంట్ (ఎస్‌ఎఫ్‌డీ) కన్వీనర్ లలిత్ కుమార్ నాయకత్వం వహించారు.