
రికార్డుల భద్రతకు చర్యలు
● కలెక్టర్ మహేష్ కుమార్
● ముంపు బారిన పడిన కార్యాలయాల పరిశీలన
ముమ్మిడివరం: భారీ వర్షాల నేపథ్యంలో పల్లపు ప్రాంతాలలో ఉన్న కార్యాలయాల్లో రికార్డుల భద్రతకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఆయన గురువారం ఇన్‌చార్జి డీఆర్‌ఓ కె.మాధవితో కలిసి ముమ్మిడివరంలో పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, ఉప ఖజానా అధికారి కార్యాలయాలను సందర్శించారు. భద్రపర్చిన రికార్డులు, రూములు, కంప్యూటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా బుధవారం భారీ వర్షం కురిసిన నేపథ్యంలో పల్లపు ప్రాంతంలోని ఈ మూడు కార్యాలయాలను పరిశీలించామన్నారు. కార్యక్రమంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం.మోహన్ కుమార్, మండల పరిషత్ అధికారి టి.ఆచార్య, తహసీల్దార్ టి.సుభాష్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
నీటి భద్రత, సంరక్షణపై దృష్టి
అమలాపురం రూరల్: నీటి భద్రత, సంరక్షణ, సమర్థ వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని నీటి సంఘాల ప్రతినిధులకు కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. భూగర్భ జలాల పెంపుదలపై అమరావతి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం కలెక్టర్లతో మాట్లాడారు. దానిలో పాల్గొన్న అనంతరం మహేష్ కుమార్ ఈ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎప్పటికప్పుడు పంట కాలువలు, డ్రైనేజీల్లో పూడికతీత పనులు చేపడుతూ రైతాంగానికి ముంపు బెడద లేకుండా చూడాలన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుసంధానంతో జలవనరులశాఖ నిధులతో కాలువల చిట్ట చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా సాగునీటి వ్యవస్థల పనితీరును మెరుగు పరచాలన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, జిల్లా, సాగునీటి వినియోగదారుల అధ్యక్షుడు గుబ్బల శ్రీనివాస్, ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ సంఘాల ప్రతినిధులు జలవనరులశాఖ ఇంజినీర్లు పాల్గొన్నారు.