
ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతిసే ర్యాగింగ్
రాజానగరం: విద్యార్థి దశలో జూనియర్లను ర్యాగింగ్ చేయడం ఆనందమని సీనియర్లు భావిస్తారని.. కానీ అది ఆ విద్యార్థి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న యాంటీ ర్యాగింగ్ వీక్ కార్యక్రమంలో భాగంగా గురువారం జరిగిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తన జీవితంలో కూడా ర్యాగింగ్‌కు భయపడిన సంఘటనలు ఉన్నాయంటూ గుర్తు చేసుకున్నారు. ఎవరూ ర్యాగింగ్‌కు పాల్పడవద్దని, పాల్పడితే చట్టాల నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు. ప్రతి తల్లి, తండ్రి తమ పిల్లలను ర్యాగింగ్‌కు దూరంగా ఉంచాలని చూస్తారని, అందుకోసమే ర్యాగింగ్ ఛాయలు లేని కళాశాలలు, యూనివర్సిటీలను ఎంపిక చేసుకుంటున్నారన్నారు. ర్యాగింగ్ వలన జీవితాలు నాశనం అవడమే కాకుండా కన్నవారికి, చదువుకునే సంస్థలకు కూడా చెడ్డ పేరు వస్తుందన్నారు. వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ మాట్లాడుతూ ‘నన్నయ’ వర్సిటీ అంటేనే సత్ప్రవర్తనకు కేరాఫ్ అనే ఖ్యాతిని పొందేలా మీ నడవడిక ఉండాలని విద్యార్థులకు హితవు పలికారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, అధ్యాపకులు పాల్గొన్నారు.