
పారా అథ్లెటిక్స్ పోటీలకు పార్థు ఎంపిక
ముమ్మిడివరం: కొత్తలంక జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి సబ్బతి పార్థు సంజీవ సాగర్ జాతీయ స్థాయి పారా అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని పాఠశాల ప్రత్యేక విద్య ఉపాధ్యాయుడు గంగుల సురేష్ తెలిపారు. ఈ మేరకు ఏపీ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి రామస్వామి నుంచి గురువారం ఉత్తర్వులు అందాయన్నారు. మధ్యప్రదేశ్‌లోని గ్యాలియర్‌లో ఈ నెల 29న జరిగే జాతీయ పోటీలలో పార్థు పాల్గొంటాడన్నారు. కాగా.. జాతీయ పోటీలకు ఎంపికై న పార్థును డీఈఓ షేక్ సలీం బాషా, ఎంఈఓలు గౌరీ శంకర్, ఉదయ భాస్కర్, కో ఆర్డినేటర్ ఎంవీవీ సత్యనారాయణ, జైను బాబ్జీ, హెచ్‌ఎం గోవర్ధన్ గిరి, ఉపాధ్యాయులు అభినందించారు.
ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం
కొత్తపేట: ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించిన ఘటన కొత్తపేటలోని భాస్కర పిల్లల ఆసుపత్రిలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమలాపురం సమీపంలోని ఈదరపల్లికి చెందిన కుంపట్ల దుర్గ, సతీష్ దంపతులకు పెళ్లయి రెండేళ్లయినా సంతానం కలగలేదు. దీంతో కొత్తపేటలోని భాస్కర చిల్డ్రన్స్ ఐవీఎఫ్ ఆసుపత్రి డాక్టర్ ప్రదీప్తి కరణను సంప్రదించారు. ఆమె వైద్యంతో గర్భధారణ సాధ్యమైంది. స్కానింగ్‌లో ముగ్గురు పిల్లలు ఉన్నట్టు గుర్తించి, ఇది కొంత ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు. అయితే తల్లిదండ్రులు ధైర్యంగా ముందుకు వచ్చారు. ఎనిమిదో నెలలో దుర్గకు నొప్పులు రావడంతో డాక్టర్ ప్రదీప్తి కరణ బృందం ఆపరేషన్ చేసి సురక్షితంగా ముగ్గురు శిశువులను బయటకు తీసింది. మొదటి అమ్మాయి, తర్వాత అబ్బాయి, చివరగా అమ్మాయి జన్మించారు. ప్రస్తుతం తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నారు. పిల్లలను అదే ఆసుపత్రిలోని పిల్లల వైద్యుడు మెంటే శ్రీధర్ ప్రత్యేక పర్యవేక్షణలో పరిశీలిస్తున్నట్టు తెలిపారు.

పారా అథ్లెటిక్స్ పోటీలకు పార్థు ఎంపిక