
శాస్త్రచికిత్సలు..
ఫ ప్రసవాలకూ ముహూర్తాలు
ఫ ఎప్పుడు పుట్టాలో నిర్ణయిస్తున్న
కుటుంబ సభ్యులు
ఫ 16 నెలల కాలంలో 74 శాతం
సిజేరియన్లు
ఫ ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యారోగ్యశాఖ
రాయవరం: పంతులు గారూ.. మా పాపకు 9వ నెల వచ్చిందండి. శస్త్రచికిత్స చేయించడానికి మంచి ముహూర్తం పెడతారా.. అంటూ తల్లిదండ్రులు పురోహితులను అడుగుతున్నారు. సాధారణంగా వివాహాలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యాలకూ ముహూర్తాలు చూపించడం సహజం. ఇప్పుడు ప్రసవాలకూ ముహూర్తాలు పెట్టించుకునే రోజులు దాపురించాయి. ఉరుకులు, పరుగుల జీవితంలో చిన్న సమస్య వచ్చినా తట్టుకునే గుణం తగ్గిపోయింది. అందుకే పిల్లలకు జన్మనివ్వడంలోనూ కొందరు నొప్పిని భరించలేకపోతున్నారు. మరికొందరు జాతకాల పిచ్చితో మంచి ముహూర్తం పెట్టించుకుని మరీ కాన్పులకు సిద్ధపడుతున్నారు. సాధారణ ప్రసవాల సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా సిజేరియన్లు పెరిగిపోతున్నాయి. ఫలితంగా తల్లులు దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.
ఒత్తిడికి గురిచేస్తూ..
ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చే వారిలో ఎక్కువ మంది ముహూర్తపు కాన్పులే చేయించుకుంటున్నారు. రోజు, తేదీ, సమయం వంటివి కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు. వైద్యులు సాధారణ కాన్పుల కోసం ప్రయత్నిస్తున్నామంటే... ఏమైనా అయితే మీదే బాధ్యతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో వైద్యులు వారి ఒత్తిడికి తలొగ్గుతున్నారు.
అవగాహన లోపం.. పిల్లలకు శాపం
సిజేరియన్ల కారణంగా పిల్లలు ముర్రుపాలకు దూరమవుతున్నారు.. తల్లికి మత్తు సూది ఇస్తారు కాబట్టి పాలు పట్టకూడదన్న అపోహతో దూరం చేస్తున్నారు. పుట్టిన వెంటనే అనారోగ్య సమస్యల కారణంగా శిశువును ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చినప్పుడు మొదటిసారి పాలు అందడం లేదు. సాధారణం అయితే పుట్టిన గంటలోపు, సిజేరియన్ అయితే రెండు గంటల్లోపు ముర్రుపాలు పట్టించాలని వైద్యులు చెబుతున్నారు. తల్లిపాలు జీర్ణాశయాంతర వ్యాధుల నుంచి ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడుతుంది. నవజాత శిశువు మరణాలను తగ్గిస్తుంది. కేవలం 34 శాతం మంది శిశువులు మాత్రమే మొదటి గంటలో ముర్రుపాలు తాగుతున్నారు.
ఏ రోజో నిర్ణయించుకుని..
ఈ రోజుల్లో ఎక్కువ మంది ముహూర్తపు ప్రసవాలకే ప్రాధాన్యమిస్తున్నారు. రోజు, సమయం, స్థలంతో పాటు అనస్థీషియా ఇవ్వడం, బిడ్డ బయటకు రావడం కూడా కుటుంబ సభ్యులే నిర్ణయిస్తున్నారు. ఆ ఇంటికి సంబంధించిన ప్రత్యేకమైన రోజు, లేదంటే ఎవరిదైనా పుట్టిన రోజు, పెళ్లి రోజు, లేకుంటే పురోహితుడు నిర్ణయించిన సమయం కచ్చితంగా పాటిస్తున్నారు. దీనివల్ల సీసెక్షన్లు పెరిగాయి. దీనిని సిజేరియన్ డెలివరీ ఆఫ్ మెటర్నల్ రిక్వెస్ట్ (సీడీఎంఆర్) అంటారు. ప్రసవాలు చేయడానికి సంబంధించిన నిబంధనల్లో ఇది లేకున్నా ప్రస్తుతం సాధారణమైంది. దీంతో పాటు గర్భిణులు, వారి కుటుంబ సభ్యులకు ఓపిక తగ్గిపోతుంది. గర్భిణికి నొప్పులు రాగానే సర్జరీ చేయాలని చెబుతున్నారు. సాధారణ కాన్పు కావాలంటే ఓపిక అవసరం. సాధారణ ప్రసవానికి సుమారు 24 గంటలు పడుతుంది. గర్భసంచి ముఖద్వారం 0–10 సెంటీమీటర్లు తెరుచుకుంటేనే బిడ్డ బయటకొస్తుంది. ఈ లోపు కుటుంబ సభ్యులు ఓపిక పట్టలేకపోతున్నారు. తద్వారా సర్జరీ చెయ్యాల్సిన అవసరం తలెత్తుతోంది. పీనట్ బాల్, రౌండ్ బాల్, కివీ వాక్యూమ్ పంప్ వంటి అధునాతన పద్ధతులను ఉపయోగించి సాధారణ కాన్పులు చేసేందుకు వీలుంటుందని వైద్యులు చెబుతున్నారు.
వైద్యుల సూచనలు పాటించాలి
సాధారణ ప్రసవాలకు అధిక సంఖ్యలో గర్భిణులు అంగీకరించడం లేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోనే సిజేరియన్లు అధికంగా జరుగుతున్నాయి. దీనికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల్లో వేచిచూసే ధోరణి లేకపోవడం ప్రధాన కారణం. సిజేరియన్ కోసం డాక్టర్లపై వివిధ రూపాల్లో ఒత్తిడి తీసుకు వస్తున్నారు.
–డాక్టర్ ఎస్.ప్రవీణ్, సూపరింటెండెంట్, ఏరియా ఆస్పత్రి, రామచంద్రపురం
మొదటి నుంచీ
అవగాహన అవసరం
సాధారణ ప్రసవాలు పెరగాలంటే ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం. ినేటి కాలంలో పురిటి నొప్పులు భరించేందుకు గర్భిణులు సిద్ధంగా ఉండడం లేదు. గర్భం దాల్చినప్పటి నుంచే తల్లిదండ్రులు ఏ పనులు చెయ్యనివ్వడం లేదు. తొమ్మిదో నెల వరకూ చిన్న చిన్న ఇంటి పనులు చేసుకోవడం మంచిది. పురిటి నొప్పులు భరించగలిగేలా మొదటి నుంచీ అవగాహన కల్పిస్తే మంచిది.
–పి.ప్రశాంతి, గైనకాలజిస్ట్, సీహెచ్‌సీ, మండపేట
ఒత్తిడి అధికమైతే..
సాధారణ ప్రసవాలు చేయడానికే ప్రాధాన్యమిచ్చేలా చూస్తున్నాం. చిన్న వయసులో గర్భం దాల్చిన వారు నొప్పులు తట్టుకోలేక సిజేరియన్‌కే మొగ్గు చూపుతున్నారు. సాధ్యమైనంత వరకూ సాధారణ ప్రసవాలు చేయడానికి చూస్తున్నాం. గర్భిణి, వారి కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి అధికమైతే ఏరియా ఆస్పత్రికి పంపిస్తుంటాం.
–సీహెచ్ రమ్మశ్రీ, పీహెచ్‌సీ వైద్యాధికారి, రాయవరం
కారణాలు ఎన్నో..
సిజేరియన్లు పెరగడానికి వివిధ కారణాలు ఉన్నాయి. రక్తహీనత, నెగిటివ్ రక్త గ్రూపు ఉండటం, ఇతర సమస్యలతో బాధపడుతున్న గర్భిణులను పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల నుంచి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకొస్తున్నారు. అప్పుడు కచ్చితంగా సిజేరియన్ చేయడం తప్ప మరో మార్గం ఉండడం లేదు. అదే సందర్భంలో మొదటిసారి కాన్పు కోసం ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే వారిలో తక్కువ స్థాయిలో సిజేరియన్లు చేస్తున్నారు.
సిజేరియన్లదే సింహభాగం
16 నెలల కాలంలో సిజేరియన్లదే సింహభాగం. 2024 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జూలై వరకూ కోనసీమ జిల్లాలో 22,094 డెలివరీలు జరగ్గా, ఇందులో 16,409 (74 శాతం) సిజేరియన్‌లేనని వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. 5,685 మందికి (26 శాతం) మాత్రమే సాధారణ కాన్పులు జరిగాయి.

శాస్త్రచికిత్సలు..

శాస్త్రచికిత్సలు..

శాస్త్రచికిత్సలు..