
భీమేశ్వరాలయ ప్రధాన అర్చకుడి మృతి
రామచంద్రపురం రూరల్: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయ అనువంశిక ప్రధాన అర్చకుడు బ్రహ్మశ్రీ కళ్లేపల్లి ఫణికుమార్ (83) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్చక సమాఖ్య అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఆయనకు ఒక కుమారుడు శ్రీనివాస్, కుమార్తె సుందరి ఉన్నారు. ఆయన మృతికి సంతాపంగా భీమేశ్వరాలయాన్ని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు మూసివేశారు. ఆయన మృతికి ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఆలయ ఈఓ అల్లు వెంకట దుర్గాభవాని, ఆలయ అర్చకులు కళ్లేపల్లి విశ్వప్రకాశ్, జుత్తుక శ్రీకాంత్, పురోహితులు దొంతుర్తి శ్రీరామచంద్రమూర్తి, మేడవరపు శ్రీనివాస చింతామణి, ఆర్యవైశ్య సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి చెరుకు బాబూరావు, దేవాలయ వైదిక బృందం, ఆలయ సిబ్బంది తమ సంతాపాన్ని తెలియజేశారు.
మెట్లపై నుంచి జారిపడి
తాపీమేస్త్రి మృతి
అల్లవరం: మండలంలోని బెండమూర్లంక గ్రామంలో యాళ్ల వెంకట రామ్మోహనరావుకు చెందిన నూతన గృహ నిర్మాణ పనులు చేస్తుండగా తాపీమేస్త్రి ముత్యాల వీరన్నబాబు (47) ప్రమాదవశాత్తు శుక్రవారం జారిపడి మృతి చెందాడు.
అల్లవరం ఎస్సై బి.సంపత్‌కుమార్ కథనం ప్రకారం.. శుక్రవారం ఇంటి పనులు చేస్తుండగా మెట్లపై నుంచి జారిపడి తాపీమేస్త్రి వీరన్నబాబు అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. అతనితో పనిచేస్తున్న సహచర కూలీలు వీరన్నబాబును హూటాహూటిన అమలాపురంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడని ఎస్సై తెలిపారు. మృతుడి కుమారుడు ముత్యాల సాయి పవన్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.