
రత్నగిరిపై సీఎన్‌జీ కారు దగ్ధం
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలోని హరిహరసదన్ సత్రం వద్ద నిలిపి ఉంచిన సీఎన్‌జీ (కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్) కారు దగ్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం నుంచి గురువారం అర్ధరాత్రి ఆ కారులో వచ్చిన భక్తులు కారును హరిహరసదన్ సత్రం ఎదురుగా నిలిపి ఉంచి ఆ సత్రంలో బస చేశారు. అయితే వారు నిలిపిన అర గంటలోనే కారు నుంచి పెద్ద శబ్దంతో మంటలు వచ్చాయి. అగ్నినిరోధక యంత్రాలతో సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ నిమిషాల వ్యవధిలో కారు కాలిపోయింది. దాంతో సెక్యూరిటీ సిబ్బంది ఆ కారు పక్కన నిలిపి ఉంచిన ఇతర కార్ల యజమానులను అప్రమత్తం చేసి ఆ కారుకు దూరంగా పెట్టించారు. ఓ కారు యజమాని అందుబాటులోకి రాకపోవడంతో భద్రతా సిబ్బంది కారు అద్దాలు బద్దలు కొట్టి ఆ కారు హేండ్ బ్రేక్ తీసి దానిని దూరంగా నెట్టారు. అయితే దగ్ధమవుతున్న కారు వేడికి ఆ కారు కూడా కొంతమేర పాడైంది. కాగా, ఖమ్మం నుంచి సుమారు ఏడు గంటల పాటు కారును ఎక్కడా ఆపకుండా నడుపుతూ రావడంతో కారు వేడెక్కి నిలిపిన వెంటనే మంటలు చెలరేగి ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.