వేలం... కూటమి గాలం | - | Sakshi
Sakshi News home page

వేలం... కూటమి గాలం

Aug 9 2025 7:38 AM | Updated on Aug 9 2025 7:38 AM

వేలం... కూటమి గాలం

వేలం... కూటమి గాలం

నాళంవారి సత్రం భూముల కౌలు వేలం మళ్లీ వాయిదా

కూటమి నేతల ఒత్తిళ్లతో ఖరారు కాని వైనం

నచ్చిన వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నం

తొండంగి: వేలం నిర్వహించకుండా కూటమి గాలం వేసింది.. అధికారాన్ని అడ్డంపెట్టుకుని తమకు నచ్చిన వారికి మేలు చేసేందుకు ప్రయత్నిస్తుంది.. సత్రం భూముల కౌలు వేలాన్ని మళ్లీ మళ్లీ వాయిదా వేస్తూ రైతులను తిప్పించుకుంటోంది.. సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్న నాళంవారి సత్రం దాతల ఆశయాలకు కూటమి పార్టీ నేతల ఒత్తిడితో దేవదాయ, ధర్మదాయశాఖ యంత్రాంగం తూట్లు పొడుస్తుంది. రాజమహేంద్రవరం నాళంవారి సత్రంలో శుక్రవారం నిర్వహించిన శృంగవృక్షంలోని భూముల కౌలు వేలాన్ని అధికారులు మళ్లీ వాయిదా వేయడంతో కౌలు వేలం కోసం వెళ్లిన రైతులంతా నిరాశగా వెనుదిరిగారు. ఒకపక్క ఖరీఫ్‌ సాగు కాలం ప్రారంభమైనా భూములకు కౌలు వేలం పూర్తి చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. నాళంవారి సత్రానికి చెందిన 268.64 ఎకరాల భూమి శృంగవృక్షంలో ఉంది. ఈ భూములకు ప్రతి మూడేళ్లకు ఒకసారి కౌలు వేలం నిర్వహించగా వచ్చిన ఆదాయంతో సత్రం ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కాగా ఈ ఏడాది కౌలు కాలం ముగియడంతో ఏప్రిల్‌లో దేవదాయ, ధర్మదాయశాఖ అధికారులు, సత్రం అధికారులు కలసి శృంగవృక్షం పంచాయతీ కార్యాలయంలో కౌలు వేలం ప్రక్రియ నిర్వహించారు. పాత బకాయిల వసూళ్ల సాకుతో కౌలు వేలాన్ని వాయిదా వేశారు. మళ్లీ జూలై 23న రాజమహేంద్రవరం నాళం వారి సత్రం కార్యాలయంలో కౌలు వేలం నిర్వహించారు. 268.64 ఎకరాలకు సంబంధించి 13 బిట్లుగా కౌలు వేలం నిర్వహించగా, మొదటి బిట్టు 27.19 ఎకరాలకు శృంగవృక్షంకు చెందిన రైతు యనమల నాగేశ్వరరావు రూ.3.68 లక్షలకు హెచ్చుపాటగా కౌలు ఖరారు చేసుకున్నారు. అదేవిధంగా రెండో బిట్టుగా 25.85 ఎకరాలకు మరో రైతు అమృత లోవబాబు రూ.5.01 లక్షలకు హెచ్చుపాటగా వేలం ఖరారు చేసుకున్నారు. కాగా మిగిలిన బిట్లు వేలం నిర్వహించగా, వేలానికి వచ్చిన రైతులు వేలం స్థలం నుంచి వెళ్లిపోయారంటూ అధికారులు మిగిలిన 11 బిట్లుకు కౌలు వేలాన్ని వాయిదా వేశారు. తిరిగి శుక్రవారం వేలం నిర్వహిస్తున్నట్టు శృంగవృక్షంలో రైతులకు తెలియడంతో వేలంలో పాల్గొనేందుకు రాజమహేంద్రవరం నాళంవారి సత్రానికి కొద్దిమంది రైతులు వెళ్లారు.

అక్కడకు వెళ్లిన రైతులకు కౌలు వేలం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడంతో నిరాశగా వెనుతిరిగారు. తొండంగి మండలానికి చెందిన కూటమి పార్టీ నేతలు అధికారులకు ఫోన్లు చేయడంతోనే కౌలు వేలాన్ని వాయిదా వేశారని రైతులు వాపోతున్నారు. ఇటీవల తొండంగిలో పిఠాపురం శ్రీసంస్థాన సత్రం భూముల కౌలు వేలం ప్రక్రియను కూడా కూటమి పార్టీ నేతల ఆధ్వర్యంలో పోలీసుల బెదిరింపులతో తమకు నచ్చిన వారికి కౌలు వేలాన్ని కట్టబెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా నచ్చిన వారికి కౌలు వేలాన్ని కట్టబెట్టేందుకే కూటమి నేతల ఒత్తిళ్లతో సత్రం ఆదాయానికి గండికొడుతూ అధికారులు పలుమార్లు వాయిదాల పర్వం కొనసాగిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఖరీఫ్‌ పంట కాలం ప్రారంభం కావడంతో కౌలు వేలం ఖరారు కాకపోవడంపై మండిపడుతున్నారు. వీలైనంత త్వరగా శృంగవృక్షంలోనే సత్రం అధికారులు కౌలు వేలాన్ని నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement