
నేస్తం మానేశారు
సాక్షి, అమలాపురం: చేనేత పరిశ్రమకు చంద్ర గ్రహణం పట్టింది.. ఒకవైపు ముడి సరుకు ధరలు పెరగడం.. మరోవైపు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందకపోవడం.. ఇంకోవైపు చేనేత సంఘాలకు బకాయిలు విడుదల కాకపోవడం.. ఇలా చెప్పుకొంటూ పోతే కారణాలు ఏమైనా నేతన్నకు రోజు గడవడం కష్టంగా మారింది. చేతిలో అద్భుత నైపుణ్యం ఉన్నప్పటికీ జేబులో పైసలు లేని పరిస్థితి వచ్చింది. గురువారం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జిల్లాలో నేత కార్మికుల ఆకలి బాధలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
జిల్లాలో చేనేత రంగం ఒకప్పుడు అగ్రస్థానంలో ఉండేది. ఇప్పటికీ పలు గ్రామాలు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాయి. ఊరి పేరుతో ఇక్కడ తయారైన వస్త్రాలు రాష్ట్రంలో తిరుగులేని ఖ్యాతి పొందాయి. కపిలేశ్వరపురం మండలం అంగర, మండపేట మండలం ఏడిద, ఉప్పలగుప్తం మండలం విలసవిల్లి, అమలాపురం మండలం బండారులంక, సఖినేటిపల్లి మండలం మోరి, అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు వంటి గ్రామాలు చేనేత రంగంపై సొంత బ్రాండ్ సృష్టించుకున్నాయి. జిల్లాలో 3,500కు పైగా చేనేత మగ్గాలు ఉన్నాయని అంచనా. ప్రస్తుతం నేత కార్మికులకు రోజువారీ పని ఉండడం లేదు. స్థానికంగా తయారు చేస్తున్న చీరలకు మార్కెట్‌లో డిమాండ్ తగ్గింది. దీంతో పేరొందిన చోట నుంచి వస్తున్న చీరల ఆర్డర్లపైనే ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతోంది. దీనికితోడు నూలు, ఇతర ముడి సరకుపై రావాల్సిన రాయితీ నెలలు గడుస్తున్నా అందడం లేదు. 30 శాతం రిబేట్ అమ్మకాలపై సంఘాలకు రాయితీలు రావడం లేదు. అలాగే పావలా వడ్డీ రాయితీ ఎగిరిపోయింది. దీని స్థానంలో రూపాయి వడ్డీ వచ్చి చేరింది. ఇలా నేత కార్మికులు, వారికి అండగా ఉన్న చేనేత సహకార సంఘాలపై మోయలేని భారం పడింది. దీనికితోడు గత ప్రభుత్వం అమలు చేసిన నేతన్న నేస్తం పథకాన్ని కూటమి ప్రభుత్వం ఎత్తివేసింది. ఇవన్నీ నేత కార్మికులను అప్పుల ఊబిలో నెట్టివేసింది.
గత ప్రభుత్వంలో పెద్దపీట
2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు పెద్దపీట వేసింది. ముడి సరకు కొనేందుకు, మగ్గాల మరమ్మతుల నిమిత్తం చేనేత కార్మికులకు ఏటా రూ.24 వేల చొప్పున గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అందించింది. జిల్లాలో గత ఐదేళ్లలో ఏడాదికి సగటున 3,560 మంది చొప్పున రూ.43.33 కోట్ల మేర లబ్ధి చేకూరింది. నేతన్న నేస్తం వల్ల ముడి సరకు, ఇతర అవసరాల కోసం బయట అప్పులు చేయాల్సి అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు దానికి భిన్నంగా ఉంది.
అప్పుల ఊబిలో నేతన్నలు
రోజు వారీ పనులు లేక ఇబ్బంది
గత ప్రభుత్వంలో
3,560 మందికి ‘నేతన్న నేస్తం’
కూటమి ప్రభుత్వం వచ్చాక ఎత్తివేత
నేడు జాతీయ చేనేత దినోత్సవం
నేతన్నలు కోరుతున్నవి ఇవే..
చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలి. లేదా పాలక మండళ్లు ఏర్పాటు చేయాలి. సంఘాలకు ఉన్న బకాయిలను తక్షణం విడుదల చేయాలి.
ఈ ఏడాది మార్చి 31 నాటికి ఉన్న చేనేత సంఘాల బకాయిలను రద్దు చేయాలి.
పావలా వడ్డీ పథకం అమలు చేయడంతోపాటు పెండింగ్ బకాయిల విడుదల చేయాలి.
నూలుపై 40 శాతం రాయితీ ఇవ్వాలి.
గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా నేతన్న నేస్తం పథకం ద్వారా సొంత మగ్గం ఉన్నవారికి ఏడాదికి రూ.24 వేలు అందజేయాలి.
చేనేత కార్మికుల సంక్షేమం నిమిత్తం ప్రస్తుతం అమలులో ఉన్న త్రిప్టు ఫండ్ పథకం బకాయిలు వెంటనే విడుదల చేయాలి.
చేనేత కార్మికులకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితమంటున్న ప్రభుత్వం కొర్రెలు వేస్తోంది. మగ్గం ఉన్నవారి పేరుపైనే విద్యుత్ సర్వీసు ఉండాలని చెబుతోంది. అద్దెకు ఉన్నవారికి ఇది వర్తించదు. కాబట్టి మగ్గం ఉన్నవారందరికీ ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలి.
సంక్షోభానికి కారణలెన్నో..
జిల్లా వ్యాప్తంగా 23 చేనేత సహకార సంఘాలు ఉండగా, గడిచిన 14 ఏళ్ల నుంచి ఎన్నికల నిర్వహించిన దాఖలాలు లేవు. ఈ కారణంగా సంఘాలపై అధికారులు పెత్తనం పెరగడం, సంఘాలకు రావాల్సిన బకాయిల వసూళ్లలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
ఆప్కో, అలాగే ప్రభుత్వం నుంచి రూ.కోట్ల బకాయిలు పెరిగిపోవడంతో సంఘాలకు, కార్మికులకు ఆర్థిక భారంగా మారింది. 2018 జీఓ ప్రకారం చేనేత కార్మికులకు కొనుగోలు చేసే నూలుపై 40 శాతం రాయితీ ఇవ్వాల్సి ఉంది. 30 శాతం డిస్కౌంట్ అమ్మకాలపై ఒక్క అంగర సహకార సంఘానికి రూ.75 లక్షలు, హసన్‌బాద్ సంఘానికి రూ.35 లక్షల వరకూ రావాల్సి ఉంది.
2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆరు జీఓలను తెచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోవడం లేదు.
నాడు క్రమం తప్పకుండా సాయం
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా క్రమం తప్పకుండా నేతన్న నేస్తం ద్వారా ప్రతి మగ్గానికి రూ.24 వేలు అందించారు. దీనివల్ల నేతన్నలకు ఆకలి బాధలు తప్పాయి. అప్పులు చేయాల్సిన అవసరం లేకపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పథకం ఊసే లేదు. ఈ పథకాన్ని తక్షణం అమలు చేయాలి.
–జానా గణేష్, వైఎస్సార్ సీపీ చేనేత విభాగం అధ్యక్షుడు,
బండారులంక, అమలాపురం మండలం
రుణమాఫీ చేయాలి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కార్మికులు ఉపయోగించే నూలుపై ఉన్న జీఎస్టీని తొలగిస్తామని హామీ ఇచ్చారు. చేనేత సొసైటీల్లో ఉన్న రుణాలను మాఫీ చేస్తామని, 200 యూనిట్లకు విద్యుత్ ఉచితంగా ఇస్తామన్నారు. సంఘాలు తీసుకున్న రుణాలు రద్దు చేస్తామని చెప్పారు. వీటిని వెంటనే అమలు చేయాలి.
–అందె సూర్యనారాయణమూర్తి, చేనేత కార్మికుడు,
పుల్లేటికుర్రు, అంబాజీపేట మండలం

నేస్తం మానేశారు

నేస్తం మానేశారు

నేస్తం మానేశారు