
ఈ–క్రాప్ జాబితాలో కోకోను చేర్చాలి
అంబాజీపేట: కొబ్బరిలో అంతర పంటగా సాగు చేస్తున్న కోకోను ప్రభుత్వం ఈ– క్రాప్ జాబితాలో చేర్చాలని ఏపీ కోకో రైతుల సంఘ అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, కార్యదర్శి కె.శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంబాజీపేటలో కోనసీమ కోప్రా మర్చంట్స్ అసోసియేషన్ హాల్లో బుధవారం ఏపీ కోకో రైతుల సంఘ సమావేశం జిల్లా కోకో రైతుల సంఘ అధ్యక్షుడు ఉప్పుగంటి భాస్కరరావు అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో రైతుల సంక్షేమానికి కోకో బోర్డు ఏర్పాటు చేసి, అన్ని రకాల రాయితీలు కల్పించాలన్నారు. కోకో గింజలు కొనుగోలు చేయడంలో కార్పొరేట్ కంపెనీలు కాదు... కోఆపరేటివ్ కంపెనీలు కావాలని సమావేశంలో కోకో రైతులు నినాదించారు. కోకో రైతులను అటు ప్రభుత్వం, ఇటు జాతీయ కంపెనీలు మోసం చేస్తూ, నిలువు దోపిడీ చేస్తున్నాయని అన్నారు. 2024లో కిలో కోకో గింజలను రూ. వెయ్యి వరకూ కొనుగోలు చేశారని, ప్రస్తుతం రూ. 450కు మాత్రమే కొంటున్నారన్నారు. ఈ ఏడాది మే నెల వరకూ 3,076 మంది రైతుల నుంచి 2,358 మెట్రిక్ టన్నుల గింజలను మాత్రమే కొనుగోలు చేశారన్నారు. 2025లో ప్రభుత్వం మరో 75 వేల ఎకరాల్లో కోకో పంటను సాగు చేయడం లక్ష్యమని ప్రకటించిందని అన్నారు. 2024 వరకూ కోకో గింజలు కొనుగోలు చేసిన కంపెనీలు ఏ విధమైన ప్రమాణాలు పాటించలేదని, ఈ ఏడాది ఆంక్షలు పెడుతూ కోకో గింజలను రైతులు ఆశించినంతగా కొనుగోలు చేయట్లేదని అన్నారు. ‘మాండలిజ్’ కంపెనీ రైతులను నిబంధనల పేరుతో నిలువు దోపిడీ చేస్తోందని శ్రీనివాస్ ఆరోపించారు. ప్రస్తుతం దేశానికి 1.35 లక్షల మెట్రిక్ టన్నుల కోకో గింజలు అవసరం కాగా, ఇక్కడ రైతులకు అంతర్జాతీయ ధర చెల్లించకుండా కేవలం రూ. 450 మాత్రమే చెల్లించి, ఇతర దేశాల నుంచి రూ. 1,074లు చెల్లించి దిగుమతి చేసుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మండలానికి ఒక కోకో గింజల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది. ఏపీ కోకో రైతు సంఘ సహాయ కార్యదర్శి వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి ఆనంద ప్రసాద్, జిల్లా కార్యదర్శి అడబాల రాజమోహన్, కోకో రైతులు ముత్యాల జమీల్, గణపతి వీర రాఘవులు, చేకూరి సూర్యనారాయణ రాజు, అడ్డాల గోపాలకృష్ణ, అయ్యగారి శ్రీనివాస్ పాల్గొన్నారు.