
కాలువలో చెత్త పోసేందుకు వెళ్లి..
గల్లంతైన బాలిక మృతి
కొత్తపేట: ప్రమాదవశాత్తు పంట కాలువలో పడి ఓ బాలిక గల్లంతైంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కొత్తపేట మండలం ఖండ్రగ పులిసిగంటివారిపేటకు చెందిన యార్లగడ్డ లోకేశ్వరి (15) పదో తరగతి చదువుతుంది. సోమవారం సాయంత్రం స్కూల్ నుంచి వచ్చి, ఇంటి వాకిలి తుడిచి ఆ చెత్తను పారబోయడానికి సమీపంలోని బొబ్బర్లంక – అమలాపురం ప్రధాన పంట కాలువ వద్దకు వెళ్లింది. ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతైంది. అప్పటి నుంచి స్థానికులు గాలించినా ఫలితం లేకపోయింది. బుధవారం తహసీల్దార్ వై.రాంబాబు, ఎస్సై జి.సురేంద్ర పరిస్థితిని సమీక్షించి, ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. దానితో రెండు రోజుల అనంతరం ఆదే పంచాయతీ పరిధి నక్కావారిపేట సమీపంలో బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. మృతురాలి తండ్రి వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేంద్ర తెలిపారు.
పిల్లలు లేకపోవడంతో..
పులుసుగంటి వెంకటరమణ, అనంతలక్ష్మి దంపతులకు పిల్లలు లేక బంధువుల అమ్మాయి లోకేశ్వరిని దత్తత తీసుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. వెంకటరమణ వ్యవసాయ కూలీ కాగా తల్లి అనంతలక్ష్మి కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగు కోసం కొన్నాళ్ల క్రితం ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లింది. ఇక్కడ తండ్రి, కుమార్తె ఉంటున్నారు. తల్లి త్వరలో తిరిగి రావాల్సిండగా ఈలోపు కుమార్తె లోకేశ్వరి కాలువలో పడి మృతి చెందడంతో కువైట్ నుంచి ఆమె హుటాహుటిన వచ్చింది. జరిగిన దుర్ఘటనతో ఆమెతో పాటు వెంకటరమణ రోదిస్తున్నారు.

కాలువలో చెత్త పోసేందుకు వెళ్లి..