
కువైట్‌లో పొన్నమండ వాసి మృతి
● రెండు నెలల తర్వాత
స్వగ్రామానికి మృతదేహం
● జూన్ 1న ఆ దేశంలో
ఏసీ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం
రాజోలు/ అమలాపురం రూరల్: కువైట్‌లో రెండు నెలల క్రి తం జరిగిన ఏసీ షార్ట్ సర్క్యూట్ ప్రమాదంలో తొమ్మిది మంది అగ్నికి ఆహుతయ్యారు. గుర్తుపట్టలేనంతగా మృతదేహాలు కాలిపోయాయి. తొమ్మిది మంది మృతుల్లో రాజోలు మండలం పొన్నమండ గ్రామానికి చెందిన కడలి దుర్గాసంతోష్ ఉన్నట్టు గుర్తించారు. అయితే మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా ఉండడంతో కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్ చొరవతో మంగళగిరి ఎయిమ్స్ ఆస్పత్రిలో దుర్గాసంతోష్ కుటుంబ సభ్యులకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించారు. డీఎన్‌ఏ నివేదికలను కువైట్‌లోని ఇండియన్ ఎంబసీకి పంపించారు. ఆ నివేదిక ద్వారా దుర్గాసంతోష్ మృతదేహాన్ని గుర్తించి కార్గో విమానం ద్వారా హైదరాబాద్, అక్కడి నుంచి ఏపీఎన్‌ఆర్‌టీ ద్వారా స్వగ్రామం పొన్నమండ తీసుకు వచ్చారు. కోనసీమ జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ సంస్థ చొరవతో కుమారుడి మృతదేహం స్వగ్రామానికి వచ్చిందని మృతుడి తండ్రి సూర్యనారాయణ, చిన్నాన్న ఆదినారాయణ తెలిపారు. కోనసీమ వాసి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకు వచ్చేందుకు జిల్లా ఎస్పీ కృష్ణారావు, కొత్తపేట డీఎస్పీ మురళీమోహన్, కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ సంస్థ వికాస పీడీ కె.లచ్చారావు, మేనేజర్ జి.రమేష్, మహిళా కానిస్టేబుల్ బి.సఫియా, హెడ్ కానిస్టేబుల్ కె.సత్తిబాబులను కలెక్టర్ మహేష్ కుమార్ అభినందించారు.