
గోదావరిలో విద్యార్థి గల్లంతు
వాడపల్లి వెంకన్న దర్శనానికి వచ్చి
స్నానం చేస్తుండగా మునక
కొత్తపేట: దైవ దర్శనానికి వచ్చి గోదావరిలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తూ ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. ఆత్రేయపురం ఎస్సై రాము కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని వేంసూరు మండలం మెర్లపాడు గ్రామానికి చెందిన పంతంగి దినేష్ (22) బీటెక్ పూర్తి చేశాడు. వాడపల్లి గ్రామంలో వేంకటేశ్వరస్వామి దర్శనానికి దినేష్‌తో సహా ఆరుగురు స్నేహితులు టూర్ ప్లాన్ చేసుకున్నారు. శుక్రవారం రాత్రి అక్కడ బయలుదేరి శనివారం తెల్లవారు జామున 4 గంటలకు వాడపల్లి చేరుకున్నారు. స్నానం చేసి దైవ దర్శనానికి వెళ్దామని ఆరుగురూ సమీపంలోని గోదావరి రేవు వద్దకు వెళ్లారు. స్నానం చేస్తుండగా వారిలో దినేష్ ప్రమాదవశాత్తూ గల్లంతయ్యాడు. వెంటనే సహచర విద్యార్థులు దేవస్థానం సమాచార కేంద్రంలో జరిగిన ఘటన తెలిపారు. దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్పందించి ఎస్‌డీఆర్‌ఎఫ్, రెవెన్యూ, పోలీస్ అధికారులను అప్రమత్తం చేసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులను అప్రమత్తం చేసి ఆ ప్రాంతంలో గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. గోదావరి వడి ఎక్కువగా ఉండటంతో విద్యార్థి ఆచూకీ లభ్యం కాలేదు. తహసీల్దార్ టీఆర్ రాజేశ్వరరావు, ఎంపీడీఓ డీకేఎస్‌ఎస్ వెంకటరామన్, రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్, ఎస్సై రాము సంఘటన స్థలానికి చేరుకుని స్థానిక మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే కొత్తపేట ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు సిబ్బందితో అక్కడికి చేరుకుని నాటు బోటుపై, 15 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది రెండు స్పీడ్ బోట్లపై గోదావరిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

గోదావరిలో విద్యార్థి గల్లంతు