
నిత్య నిర్మలా గోవిందా..
వాడపల్లి క్షేత్రంలో కిక్కిరిసిన భక్తజనం
ఫ వాడపల్లి క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం
ఫ ఒక్కరోజే రూ.60.88 లక్షల ఆదాయం
కొత్తపేట: గోవిందా హరి గోవిందా... నిత్య నిర్మల గోవిందా అంటూ ఆ ఏడు వారాల వెంకన్నను భక్తజనం కొలిచింది. ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి క్షేత్రం నిత్య కల్యాణం పచ్చతోరణంలా వెలుగొందుతుంది. అశేష భక్తజనం తరలిరావడంతో కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కింది. శనివారం తెల్లవారు జామున ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చక స్వాములు సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలంకార ప్రియుడైన స్వామిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. సాధారణ భక్తులతో పాటు ఏడు శనివారాలు.. ఏడు ప్రదక్షిణలు నోము ఆచరిస్తున్న భక్తులతో వాడపల్లి రద్దీగా మారింది. స్వామివారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. అర్చకస్వాముల నుంచి స్వామివారి ఆశీర్వచనాలు పొందారు. అలాగే ఆలయ ఆవరణలో వేంచేసియున్న క్షేత్ర పాలకుడు అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నప్రసాదం స్వీకరించారు.
రోహిణీ కార్తెను తలపించే విధంగా ఎండ తీవ్రతతో పలువురు భక్తులు ఇబ్బంది పడ్డారు. దేవదాయ – ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాయంత్రం 5 గంటల వరకూ స్వామివారి ప్రత్యేక, విశిష్ట దర్శనాలు, అన్నప్రసాద విరాళం, సేవలు, లడ్డూ విక్రయం, ఆన్‌లైన్ తదితర సేవల ద్వారా ఈ ఒక్కరోజే దేవస్థానానికి రూ.60,88,567 ఆదాయం వచ్చినట్టు ఈఓ తెలిపారు. రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ ఆధ్వ ర్యంలో ఎస్సై రాము, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.