
చంద్రబాబుది మోసపూరిత పాలన
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
అమలాపురం టౌన్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత పాలన సాగిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. గడిచిన ఏడాది పాలనలో 21 సార్లు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి సాధించిందేమీ లేదని ధ్వజమెత్తారు. సీపీఐ జిల్లా ద్వితీయ మహాసభలను స్థానిక గడియార స్తంభం సెంటరులో రామకృష్ణ శనివారం సాయంత్రం ప్రారంభించారు. దీనికి పార్టీ జిల్లా కార్యదర్శి కె.సత్తిబాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా రామకృష్ణ హాజరై మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక ఆర్‌ఎస్‌ఎస్ వంటి మత శక్తులతో చేతులు కలిపి రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చాపకింద నీరులా చేస్తున్నారని ఆరోపించారు. తొలుత సీపీఐ నాయకులు, కార్యకర్తలు ఎర్ర జెండాలు పట్టుకుని విప్లవ గీతాలతో సభా స్థలికి ప్రదర్శనగా చేరుకున్నారు. ఈ కార్యక్రమాల్లో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డేగా ప్రభాకర్, నాయకులు రాజేంద్రప్రసాద్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పార్టీ మహాసభలు ఆది, సోమవారాల్లో కూడా జరుగుతాయని పార్టీ జిల్లా కార్యదర్శి సత్తిబాబు తెలిపారు.