
పెద్ద పంచాయతీలకు గ్రేడింగ్
8
లో
గ్రేడులుగా విభజిస్తూ..
ప్రభుత్వం కోరిన మీదట అధికారులు పంచాయతీలకు గ్రేడులను నిర్ణయిస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. ఇందులో పది వేలకు పైబడి జనాభా ఉన్న లేదా రూ.కోటి ఆదాయం ఉన్న పంచాయతీలను స్పెషల్ గ్రేడ్ పంచాయతీలుగా గుర్తించనున్నారు. వీటికి డిప్యూటీ ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ స్థాయి అధికారిని ప్రత్యేక కార్యదర్శులుగా నియమించనున్నారు. జిల్లాలో సుమారు 18 వరకూ స్పెషల్ గ్రేడ్ పంచాయతీలు కానున్నట్టు సమాచారం. ఇందులో రావులపాలెం, కొత్తపేట, అంబాజీపేట, బండారులంక, కామనగరువు, పేరూరు, మలికిపురం, ద్వారపూడి, ద్రాక్షారామ, రాయవరం, కాట్రేనికోన, అల్లవరం వంటి పంచాయతీలున్నాయి. అదేవిధంగా జిల్లాలో 128 వరకూ పంచాయతీలు గ్రేడ్–1 పరిధిలోకి రానున్నాయి. పంచాయతీ ఏడాది ఆదాయం రూ.50 లక్షల పైబడి రూ.కోటి కన్నా తక్కువ ఆదాయం, నాలుగు వేలకు పైబడి, పది వేలకన్నా తక్కువ జనాభా ఉన్న పంచాయతీలు వీటి పరిధిలోకి వస్తాయి. పదివేల కన్నా జనాభా తక్కువగా ఉన్నా ఇప్పుడు మేజర్ పంచాయతీలుగా గుర్తింపు ఉన్న పంచాయతీలు వీటి పరిధిలోకి రానున్నాయి. వీటికి గ్రేడ్– 1 స్థాయి కార్యదర్శులను నియమించనున్నారు. పంచాయతీ జనాభా రెండు వేలకు పైబడి నాలుగు వేలకు తక్కువగా ఉన్న జనాభా ఉన్న పంచాయతీలను గ్రేడ్–2 పంచాయతీలుగా గుర్తించనున్నారు. జిల్లాలో ఇటువంటి పంచాయతీలు 131 వరకూ ఉన్నాయి. ఇక రెండు వేల కన్నా తక్కువ జనాభా ఉన్న పంచాయతీలు గ్రేడ్–3 పరిధిలోకి రానున్నాయి. ఇవి 108 వరకూ ఉన్నట్టు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
● ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు
● పంచాయతీకి ఒక కార్యదర్శి తప్పనిసరి
● సచివాలయ ఉద్యోగులతో ఖాళీల భర్తీ
● అక్కరకు వస్తున్న
సచివాలయ వ్యవస్థ
సాక్షి, అమలాపురం: గ్రామ పంచాయతీలకు కార్యదర్శుల కొరత లేకుండా చేస్తామంటూ ప్రభుత్వం పంచాయతీల వికేంద్రీకరణకు సిద్ధమైంది. ఆదాయం.. జనాభాను బట్టి జిల్లాలో పంచాయతీలను నాలుగు గ్రేడ్‌లుగా విభజించనుంది. ఇందుకు సంబంధించి జిల్లా పంచాయతీ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. అయితే కార్యదర్శుల కొరత తీరుస్తామంటున్న ప్రభుత్వం ఇటు కొత్త ఉద్యోగుల కల్పన చేయడం లేదు. అటు పంచాయతీల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారికి పదోన్నతి కల్పించడం లేదు.. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజేషన్ చేయడం లేదు. ఇదే సమయంలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తెచ్చిన సచివాలయ వ్యవస్థపై నిత్యం విషం చిమ్ముతూనే, కార్యదర్శుల బాధ్యతలు నిర్వహిస్తున్న డిజిటల్ అసిస్టెంట్‌లతో పంచాయతీ కార్యదర్శులను భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది.
కోనసీమ జిల్లాలో మొత్తం 385 పంచాయతీలు ఉన్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసే వరకూ మూడు, నాలుగు పంచాయతీలకు ఒక కార్యదర్శి ఉండేవారు. ఓ కార్యదర్శి తాను పనిచేస్తున్న పంచాయతీతోపాటు మరో రెండు, మూడు పంచాయతీలకు ఇన్‌చార్జిగా ఉండేవారు. దీనివల్ల పరిపాలన మొత్తం స్తంభించేది. కనీసం పారిశుధ్య మెరుగు పనులు చేపట్టడం, విద్యుత్ దీపాల మరమ్మతులు వంటికి కూడా జరిగేవి కాదు. ఇంటి పన్నుల వసూలు, జనన, మరణ, కుల ధ్రువీకరణ పత్రాల కోసం రోజులు తరబడి ఎదురుతెన్నులు చూడాల్సి వచ్చేది. ఒక్క మాటలో చెప్పాలంటే గ్రామ పంచాయతీల్లో పాలన పడకేసిందన్నట్టు ఉండేది. ఇలాంటి సమస్యలకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెక్ పడింది. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం వాటికి అనుబంధంగా వలంటీర్ వ్యవస్థను నియమించడంతో గ్రామాల్లోనే అనేక రకాల సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. జనన, మరణ, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఇతర డాక్యుమెంట్లు, ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక, వాటిని డిజిటలైజేషన్ చేయడం వంటి పనులు సచివాలయం కేంద్రంగా జరిగేవి. సచివాలయాల నుంచి నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు ధ్రువీకరణ పత్రాలు అందడంతో ప్రజలకు పంచాయతీ అవసరాలు చాలా వరకూ తీరాయి. మరీ ముఖ్యంగా కార్యదర్శి లేక పడే ఇబ్బందులు సైతం ప్రజలకు తప్పాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయ వ్యవస్థను నెమ్మది నెమ్మదిగా నిర్వీర్యం చేయటం మొదలుపెట్టింది. వలంటీర్ వ్యవస్థ ఎత్తివేసి ఆ భారాన్ని సచివాలయ ఉద్యోగులపై మోపింది. ఇదే సమయంలో పంచాయతీలను పరిపుష్టి చేస్తామంటూ ఈ వ్యవస్థను మొత్తం ఎత్తివేసేందుకు సిద్ధమవుతోంది.
ఎవరికి లాభం..
పంచాయతీలను వికేంద్రీకరించి వాటికి గ్రేడ్లను ఇవ్వడం ద్వారా పూర్తి స్థాయి ఉద్యోగ కల్పన చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇది మంచిదే అయినా అమలు చేసే విధానంపై ఇప్పుడున్న పంచాయతీ సచివాలయ ఉద్యోగులతో పాటు గ్రామాల్లోని ప్రజలలో పలు అనుమానాలు నెలకొన్నాయి. జిల్లాలో గ్రేడ్ –1 క్యాదర్శులు 87 మంది ఉన్నారు. అలాగే గ్రేడ్–2 కార్యదర్శులు 67 మంది, గ్రేడ్–3 కార్యదర్శులు 90 మంది, గ్రేడ్– 4 కార్యదర్శులు 34 మంది వరకూ ఉన్నారు. ఇప్పుడు వీరంతా పంచాయతీల పరిధిలో ఉన్నారు. మిగిలిన కార్యదర్శుల భర్తీ కోసం గ్రేడ్–5గా గుర్తింపు పొందిన 203 మంది, గ్రేడ్–6గా ఉన్న 318 మంది సచివాలయాల కార్యదర్శులు (డిజిటల్ అసిస్టెంట్‌లు) ఉన్నారు. సచివాలయ వ్యవస్థ తప్పును పడుతూ ఇప్పుడు వాటిలో పనిచేసే వారి సేవలను పంచాయతీలకు వినియోగించుకోన్నారు. 2011 జనాభాను బట్టి పంచాయతీలను గుర్తింపు చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు జనాభాను బట్టి గ్రేడ్‌లు నిర్ణయించాల్సి ఉంది. పంచాయతీల్లో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న వారికి పదోన్నతులు ఇవ్వాల్సి ఉంది. పంచాయతీలో ఇతర ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేయాలి. అలాగే కాంట్రాక్ట్ కార్మికులు 380 మంది వరకూ ఉన్నారు. తమను రెగ్యులైజేషన్ చేయాలని కోరుతున్నారు. వీరికి అవకాశం కల్పించాల్సి ఉన్నా ప్రభుత్వం వీరి డిమాండ్‌ను పట్టించుకోవడం లేదు. ఎన్నో ఏళ్లుగా పంచాయతీల్లో పనిచేస్తున్న జేఏబీసీలు సైతం పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నారు. ఆయా డిమాండ్లు పరిష్కరించకుండా వికేంద్రీకరణ చేస్తే ఫలితం ఉండదని ఉద్యోగులు చెబుతున్నారు.