
‘సాక్షి’ ప్రసారాల నిలిపివేత అప్రజాస్వామికం
అల్లవరం: కేబుల్ ఆపరేటర్లను ఇబ్బంది పెట్టి సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం ప్రజాస్వామ్యంలో చాలా దురదృష్టకరమైన పరిణామమని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇది పత్రికా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛను హరించడమేనని, వాక్ స్వాతంత్య్రం మన రాజ్యంగం కల్పించిన హక్కు అన్నారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను సాక్షి టీవీ ఎండగడుతున్న తరుణంలో ఇటువంటి దారుణాలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, నిజాయితీ పరులైన పోలీస్ అఽధికారులు రాజీనామా చేయడమే దీనికి నిదర్శమని తెలిపారు. రాష్ట్రంలో లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని, దానికి కొంతమంది పోలీసులు సహకరించడం విడ్డూరంగా ఉందన్నారు. కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్ బీసీ మహిళ ఉప్పాల హారిక కారుపై దాడి చేయగా తిరిగి వారి పై కేసులు నమోదు చేయడం చాలా దారుణమని తెలిపారు. వచ్చేది జగనన్న ప్రభుత్వమే, కూటమి ప్రభుత్వం తీరు మారకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొకోక తప్పదని హెచ్చరించారు.
ఊరటనిచ్చిన వాన
సాక్షి, అమలాపురం: సామాన్యులు, రైతులకు ఊరటనిస్తూ జిల్లా వ్యాప్తంగా పలు మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వేసవిని తలపించిన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్య ప్రజలు సేద తీరేలా వర్షం పడింది. జిల్లా వ్యాప్తంగా గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు 14.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా అయినవిల్లి మండలంలో 63.2 మి.మీటర్లు కురవగా, అత్యల్పంగా కొత్తపేట మండలంలో 0.8 మి.మీ వర్షం కురిసింది. రావులపాలెం మండలంలో 35.2, సఖినేటిపల్లిలో 33.6, అమలాపురం 33.2, మలికిపురం 27.2, రామచంద్రపురం 25.4, మామిడికుదురు 24.8. రాజోలు 15.4, ఐ.పోలవరం 11.4, అల్లవరం 8.8, ముమ్మిడివరం 6.4, అంబాజీపేట 6.2, ఆలమూరు 5.8, కె.గంగవరం 5.4. కాట్రేనికోన 3.6, గన్నవరం 3.4, ఉప్పలగుప్తంలో 2.8 మి.మీ చొప్పున వర్షం పడింది. ఖరీఫ్‌లో మెరక శివారులకు నీరందక ఇబ్బంది పడుతున్న ప్రాంతాలలో వర్షం రైతులకు కొంతవరకు మేలు చేసింది.
నేటి నుంచి సీపీఐ జిల్లా మహాసభలు
అమలాపురం టౌన్: సీపీఐ జిల్లా ద్వితీయ మహాసభలు పట్టణంలో ఈ నెల 19, 20, 21 తేదీల్లో జరుగుతాయని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కె.సత్తిబాబు తెలిపారు. స్థానిక ఎస్‌టీయూ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశంలో మహాసభల ఏర్పాట్లపై చర్చించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తొలి రోజు స్థానిక గడియారం స్తంభం సెంటరులో జరిగే పార్టీ మహాసభలకు హాజరవుతారని చెప్పారు. రెండో రోజు స్థానిక వెంకటేశ్వరా ఫ్లాజా సమావేశపు హాలులో సమావేశం జరుగుతుందన్నారు. మూడో రోజు జిల్లా పార్టీకి కార్యవర్గ ఎన్నిక జరుగుతుందని వివరించారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు రవికుమార్, గూడాల వెంకటరమణ, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి సూర్య ప్రభ, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకట్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఉమేష్ పాల్గొన్నారు.