
అంతర్వేదిలో టూరిజం అభివృద్ధికి స్థల సేకరణ
సఖినేటిపల్లి: అంతర్వేదిలో టూరిజం అభివృద్ధికి స్థల సేకరణకు కృషి చేస్తున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అన్నారు. శుక్రవారం పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్‌ను ఆయన సందర్శించారు. హార్బర్‌లో మౌలిక వసతులు మెరుగు పర్చేందుకు తీసుకోవాల్సి చర్యలను ఆర్డీవో కే మాధవి, ఫిషరీస్ ఏడీ సిద్దార్థ వర్థన్‌లతో కలెక్టర్ సమీక్షించారు. మినీ ఫిషింగ్ హార్బర్‌కు పూర్తి స్థాయి వసతులను నిర్వహణ కమిటీ సారథ్యంలో కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇందుకు హార్బర్ ద్వారా ఆక్షన్ హాల్ అద్దెలు, ల్యాండింగ్ చార్జీలు, ఇతరత్రా ఆదాయాలను పరిగణలోకి తీసుకుని దశలవారీగా హార్బర్ అభివృద్ధికి శ్రీకారం చుడతామన్నారు. అనంతరం హార్బర్ వద్ద నుంచి బోటులో అంతర్వేది స్టీమర్ రేవు వద్ద పుష్కరరేవు ఘాట్, అక్కడ నుంచి సాగర సంగమం వరకూ వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ ప్రయాణించారు. అంతర్వేది బోటింగ్ సర్వీసెస్ అథారిటీకి చెందిన వారు బోటింగ్ యాక్టివిటీ కోసం టెండర్లు వేశారని, సాధ్యాసాధ్యాలను పరిశీలించి స్థల సేకరణ ప్రక్రియ చేపట్టాల్సి ఉందని కలెక్టర్ అన్నారు. కాగా దిండి పర్యాటక రిసార్ట్స్ నుంచి బోటులో అంతర్వేదికి భక్తులు చేరుకుని, లక్ష్మీనరసింహాస్వామిని దర్శించుకునేలా బోటింగ్ యాక్టివిటీపై అధ్యయనం చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. అంతర్వేది ఫిషింగ్ హార్బర్‌కు సమీపంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీలో ఉన్న సమస్యలపై ఆర్డీవో మాధవితో కలెక్టర్ చర్చించారు. పర్యాటక రంగ అభివృద్ధి శాఖ అధికారులు పవన్‌కుమార్, అన్వర్, తహసీల్దారు ఎం.వెంకటేశ్వరరావు, హెడ్‌వర్క్స్ ఏఈ మూర్తి, ఆర్‌ఐ రామరాజు, ఎంపీడీఓ కె సూర్యనారాయణ, సర్పంచ్ ఒడుగు శ్రీను, మైరెన్, సివిల్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.