
స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి
పెద్దాపురం: స్మార్ట్ మీటర్లను, విద్యుత్ సర్దుబాటు చార్జీల పెంపుదలను వ్యతిరేకించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు నీలపాల సూరిబాబు అన్నారు. దీనిలో భాగంగా పార్టీ ఆధ్వర్యంలో జరిగే ప్రచార కార్యక్రమ పోస్టర్‌ను సోమవారం పెద్దాపురంలోని యాసలపు సూర్యారావు భవనంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ అండతో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి ఇంటినీ దోచుకునేలా అదానీ ఏర్పాటు చేసుకున్నారన్నారు. మన అనుమతి లేకుండా బెదిరించి మరీ, స్మార్ట్ మీటర్ మార్చడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. దీనిని అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకూ కరెంటు బిల్లు వచ్చిన 15 రోజులు, నెల రోజుల లోపు సొమ్ములు కట్టేవారమని, ఇక నుంచి బిల్లు ముందుగానే చెల్లించాల్సి వస్తుందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు వేస్తే బద్దలు కొట్టండి అని చెప్పిన లోకేష్.. ఇప్పుడు ఎక్కడకు పోయారని ప్రశ్నించారు. బీజేపీ అండతో తెలుగుదేశం, జనసేన.. ప్రజల మీద కరెంటు చార్జీలు, స్మార్ట్ మీ టర్ల రూపంలో దాడి చేస్తున్నాయన్నారు. ప్రతి ప్రాంతంలోనూ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రొంగల వీర్రాజు, సుబ్బలక్ష్మి, దారపురెడ్డి కృష్ణ, నెక్కల నరసింహమూర్తి, కూనిరెడ్డి అప్పన్న పాల్గొన్నారు.