
కొబ్బరిచెట్లను కూల్చేస్తున్న గోదావరి
మామిడికుదురు: ఎగువ ప్రాంతాల నుంచి వచ్చి చేరుతున్న నీటితో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంతో వైనతేయ తీరంలో కొబ్బరి చెట్లు కూలిపోతున్నాయి. రెండు రోజుల నుంచి వరద ప్రవాహం తీవ్రంగా ఉంది. సుడులు తిరుగుతున్న నీటి ఉధృతికి కొబ్బరి చెట్లు అమాంతంగా నదిలో కూలిపోతున్నాయి. అప్పనపల్లి పాటు రేవు సమీపంలో కొబ్బరి చెట్లతో పాటు సారవంతమైన భూమి నదిలో కలిసిపోయింది. పెదపట్నం, బి.దొడ్డవరం, పెదపట్నంలంక, పాశర్లపూడి గ్రామాల్లో సైతం పరిస్థితి నెలకొంది.
పీజీఆర్‌ఎస్‌కు
265 వినతులు
అమలాపురం రూరల్: అర్జీదారుల సంతృప్తి ధ్యేయంగా పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) బీఎల్‌ఎన్ రాజకుమారి అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కారం వేదిక (పీజీఆర్‌ఎస్) నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ రాజకుమారి, ఇతర అధికారులు 265 వినతులు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ ఆశవర్కర్ల పోస్టులకు సంబంధించిన దరఖాస్తులను పీజిఆర్‌ఎస్‌లో స్వీకరించబడవన్నారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గ్రహించి డీఎంహెచ్‌వో కార్యాలయంలో దరఖాస్తులు అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా డ్వామా పీడీ ఎస్.మధుసూదన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పి.కృష్ణమూర్తి, డీఎల్‌డీవో వేణుగోపాలరావు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు
35 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 35 అర్జీలు వచ్చాయి. ఎస్పీ బి.కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు తరలివచ్చి, తమ సమస్యలపై ఫిర్యాదులు అందించారు. వాటిపై ఎస్పీ చర్చించి, పరిష్కారం కోసం ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. పోలీస్ గ్రీవెన్స్‌కు వచ్చిన ఫిర్యాదుల దర్యాప్తులో ఎంత మాత్రం అలక్ష్యం చేయవద్దని అధికారులకు ఆదేశించారు.
మహిళా పోలీసుల బదిలీలో అవకతవకలు
అమలాపురం టౌన్: జిల్లాలోని వార్డు, గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్న మహిళా పోలీసుల బదిలీల ప్రక్రియలో తప్పులు ఉన్నాయని, వాటిని తక్షణమే సవరించి, బదిలీలు సక్రమంగా సాగేటట్టు చేయాలని జిల్లా మహిళా పోలీస్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు.
ఈ మేరకు సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఎస్పీ బి.కృష్ణారావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బదిలీల మార్గదర్శకాలను అనుసరించకపోవడంతో కొందరు మహిళా పోలీసులు అన్యాయానికి గురవుతున్నారన్నారు. మెడికల్ గ్రౌండ్స్ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోలేదని, పౌస్ (భార్యాభర్తలు) విషయాన్ని కూడా పట్టించుకోకుండా పక్కన పెట్టేశారని, ఒకే మండలంలో పోస్టింగ్‌లు ఇవ్వకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ, కొన్నిచోట్ల ఆ తరహా బదిలీలు జరిగాయని, ఒకే చోట ఇద్దరికి బదిలీల ఆర్డర్లు ఇచ్చిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని వాపోయారు. జిల్లాలో 40 మందికి పైగా మహిళా పోలీసులకు బదిలీల మార్గదర్శకాలను పాటించకుండా 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న సచివాలయాలకు బదిలీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఏపీ విలేజ్ అండ్ వార్డు సెక్రటేరియట్ మహిళా పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షురాలు కె.వెంకట ధనలక్ష్మి ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రతినిధులు, బదిలీల బాధితులు జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు.

కొబ్బరిచెట్లను కూల్చేస్తున్న గోదావరి