
అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం
కొత్తపేట: అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యను పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. ఆయన అధ్యక్షతన సోమవారం కొత్తపేట ఆర్డీవో కార్యాలయంలో డివిజన్ స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాలుగు అర్జీలు స్వీకరించారు. బొబ్బర్లంక ఏటిగట్టు ఆక్రమణలను తొలగించాలని, కొత్తపేటలో కౌశిక డ్రైనేజీని శుభ్రం చేయాలని, కొత్తపేట మండలానికి సంబంధించి రెండు భూ సమస్యలపై దరఖాస్తులు అందాయి. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను సంతృప్తి స్థాయిలో మెరుగుపరిచి, ప్రజలకు సుపరిపాలనను చేరువ చేసే దిశగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించాలన్నారు. అధికారులు తమకు అందిన అర్జీపై క్షేత్రస్థాయిలో పూర్తిగా అర్జీదారుని సమక్షంలో విచారణ చేయాలన్నారు. వాటి పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో పి.శ్రీకర్, డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు.
స్థలాల పరిశీలన
స్థానికంగా రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డీఓ), డివిజనల్ అభివృద్ధి అధికారి (డీఎల్‌డీఓ) కార్యాలయాల ఏర్పాటుకు భూసేకరణకై చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు. సోమవారం స్థానిక మార్కెట్ యార్డు వద్ద ఉన్న భూములను ఆయన స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలసి పరిశీలన చేశారు.
కలెక్టర్ మహేష్ కుమార్
కొత్తపేటలో అర్జీల స్వీకరణ