
ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది
దౌత్యవేత్త
డాక్టర్ బాలభాస్కర్
రాజానగరం: సాంకేతిక విఘాతం, సోషల్, పొలిటికల్, డిప్లమేటిక్ చాలెంజెస్, ఎనర్జీ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ వంటి అనేక సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని ప్రముఖ దౌత్యవేత్త డాక్టర్ బి.బాలభాస్కర్ అన్నారు. నన్నయ యూనివర్సిటీలోని ఈసీ హాలులో శ్రీభారతీయ దృక్పథంలో విఘాతం కలిగించే సాంకేతిక పరిజ్ఞానాల భౌగోళిక శాస్త్రాన్ని నావిగేట్ చేయడంశ్రీ అనే అంశంపై మంగళవారం సెమినార్ నిర్వహించారు. దౌత్యవేత్తగా 70 దేశాలతో సంబంధాలను కలిగివున్న బాలభాస్కర్ మాట్లాడుతూ ముఖ్యంగా టెక్నాలజీలో జరిగే తీవ్రమైన మార్పుల వల్ల సమాజంలో, పరిశ్రమలో ఆర్థిక మోడల్స్, ట్రెడ్ మోడల్స్, టారీఫ్ స్ట్రక్చర్‌లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయన్నారు. వాటిని ముందుగా గ్రహించకపోతే ప్రపంచ దేశాలు పెను సవాళ్లను ఎదుర్కోక తప్పదన్నారు. సాంకేతికంగా ప్రపంచంలో జరుగుతున్న మార్పులపై విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, నిపుణులు దృష్టి సారించాలనే ఉద్దేశంతో యూనివర్సిటీలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేయడం హర్షణీయమన్నారు. కోవిడ్ వంటి విపత్కరమైన పరిస్థితులలో భారత ధాన్యాగారం విలువ ప్రపంచానికి తెలిసిందన్నారు. అన్ని రంగాలలో నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఈ క్రమంలో విద్యా వ్యవస్థలో ఉన్న అధ్యాపకులు నిత్య విద్యార్థులుగా సంబంధిత సబ్జెక్టులలో అప్‌డేట్ కావాలన్నారు.
ఎర్త్ నుండి స్పేస్ వరకు అన్ని రంగాలలో క్వాంటం టెక్నాలజీ ప్రభావం చూపిస్తోందని, దానిపై మంచి పట్టు సాధించాలన్నారు. వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ మాట్లాడుతూ దౌత్యవత్తగా దేశాల మధ్య సమస్యలను పరిష్కరించడంలో డాక్టర్ బాలభాస్కర్ కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, కోఆర్డినేటర్ డాక్టర్ వి.పెర్సిస్, డాక్టర్ బి.జగన్‌మోహన్‌రెడ్డి, డాక్టర్ పి. సురేష్‌వర్మ, డాక్టర్ కె.రమణేశ్వరి తదితరులు పాల్గొన్నారు.