
సేంద్రియ సాగుతో అనేక లాభాలు
● రైతులకు అవగాహన కల్పించాలి
● వ్యవసాయశాఖ అధికారులతో
కలెక్టర్ మహేష్ కుమార్
అమలాపురం రూరల్: రైతులు సేంద్రియ వ్యవసాయం చేపట్టేలా వ్యవసాయ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎరువుల లభ్యత, ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విధానాల ఆచరణ, ఖరీఫ్ సాగు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్థానికంగా లభించే ముడి వనరులను వినియోగించడం ద్వారా హానికరమైన రసాయన ఎరువులు, వాడకం తగ్గుతుందన్నారు. తద్వారా భూసారం మెరుగవుతుందని, భూములు చౌడు బారకుండా నేల ఆరోగ్యం బాగుంటుందన్నారు. రసాయనాలు లేకుండా తెగుళ్లు, కలుపు మొక్కలను నియంత్రించడానికి ప్రకృతి సేంద్రియ పద్ధతులు ఉపయోగపడతాయన్నారు. జీవామృతం పంచగవ్య వర్మీ కంపోస్ట్ వాడకాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. డ్రోన్ సాంకేతికత ఆధారిత వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన పెంచితే, వ్యవసాయ ఖర్చులు చాలా వరకూ తగ్గిపోతాయన్నారు. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు ఎరువుల కొరత లేకుండా సరఫరా చేయాలని, వాటిని వ్యాపారులు అధిక ధరలకు విక్రయించకుండా నియంత్రణా చర్యలు బలోపేతం చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, జిల్లా వ్యవసాయ అధికారి వి.బోసుబాబు, జిల్లా మార్కెటింగ్ అధికారి కె.విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు.
1,004 యూనిట్లకు కనెక్షన్లు
ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకూ 1,004 యూనిట్లకు కనెక్షన్లు ఇచ్చారని, ఆగస్టు 15 నాటికి మరిన్ని కనెక్షన్లు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. ఈ మేరకు సోలార్ రూఫ్‌టాప్ ఏజెన్సీలతో ఆయన సమీక్షించారు. ఈ పథకంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని, 300 యూనిట్ల పరిమితి వాడకానికి మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఉత్పత్తికి పరిమితి లేదని పేర్కొన్నారు. సమావేశంలో బ్యాంకు ఎల్‌డీ ఎం.వర్మ తదితరులు పాల్గొన్నారు.