
తమ్ముళ్ల కారు కూతలు!
● నడిరోడ్డుపై బయటపడ్డ వర్గ పోరు
● కారు అడ్డం వచ్చిందనే వంకతో దుర్భాషలు
టాస్క్‌ఫోర్స్: టీడీపీ నేతల గ్రామాల పర్యటన కుమ్ములాట, తోపులాటలకు నిలయమైంది. వారి మధ్య వర్గపోరును బహిర్గతం చేసింది. అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించేందుకు ఎంపీ పురందేశ్వరి, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణచౌదరి, మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ కుమారుడు పెందుర్తి అభిరామ్ సోమవారం కాన్వాయ్‌లో బయలుదేరారు. రాజానగరం మండలం పాలచర్ల, కోరుకొండ మండలం గాడాల అనంతరం మునగాలకు బయలుదేరిన కాన్వాయ్‌లో మొదటి నుంచి వాహనాలు ఓవర్ టేక్ చేసుకోవడం వివాదానికి కారణమయ్యింది. అటు నుంచి పలు గ్రామాలకు కాన్వాయ్ వెళ్లింది. కోరుకొండ మండలం మునగాలలోని కార్యక్రమానికి వెళ్తుండగా పెందుర్తి కారుకు మరో వర్గం కారు అడ్డుపడటంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పెందుర్తి వర్గానికి చెందిన నాయకుడిని దుర్భాషలాడటంతో వివాదం తీవ్రతరమయ్యింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ అరుపులు, కేకలతో ఇరువర్గాల కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా బొడ్డు వెంకటరమణ చౌదరి ఉండడంతో రుడా చైర్మన్ పదవి పెందుర్తి అభిరామ్‌కు వస్తుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. అది అభిరామ్‌కు దక్కకపోవడంతో నాటి నుంచి వివాదాలు అంతర్గతంగా ఉన్నాయి. ఆ వివాదాలు మునగాల ఘటన ద్వారా బయట పడ్డాయి. కూటమిలోని ఇతర నాయకులు జోక్యం చేసుకుని వ్యవహారం సద్దుమణిగేలా చేశారు. పార్టీలో ఆధిపత్య పోరు ఇలా నడిరోడ్డుపై దుర్భాష లాడటం వరకూ వెళ్లింది. కూటమిలోని పార్టీ నాయకులు, స్థానికులు, రైతుల్లో ఈ వ్యవహారం చర్చనీయాంఽశమైంది.

తమ్ముళ్ల కారు కూతలు!