పెరవలి: కూటమి నాయకుల ఇసుక దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. తాజాగా జనసేన గ్రామ అధ్యక్షుడు అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను అధికారులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామానికి చెందిన జనసేన గ్రామ అధ్యక్షుడు మేడిచెర్ల భాస్కర శివ కుమార్ అదే గ్రామంలో అక్రమంగా 700 టన్నుల ఇసుకను నిల్వ చేశాడు. దీంతో గ్రామస్తులందరూ సోమవారం పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆమె ఆదేశాల మేరకు మైనింగ్ అధికారులు దాడి చేసి ఆ ఇసుక గుట్టను స్వాధీనం చేసుకున్నారు. శివకుమార్‌పై కేసు నమోదు చేయాలో లేక జరిమానా విధించాలో కలెక్టర్ ఆదేశాల మేరకు చేస్తామని జిల్లా మైనింగ్ అధికారి ఫణిభూషణ్ రెడ్డి తెలిపారు. అక్రమ ఇసుక నిల్వలపై తమకు ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. దాడిలో జిల్లా మైనింగ్ అధికారి శైలజ, పోలీసులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
శతాధిక వృద్ధురాలి మృతి
మామిడికుదురు: గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు అన్నంనీడి మహాలక్ష్మి (101) సోమవారం మృతి చెందారు. ఆమె 1924 ఫిబ్రవరి 15వ తేదీన జన్మించారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. తొమ్మిది మంది మనవలు, మనవరాళ్లు, 16 మంది ముది మనవలు ఉన్నారు. ఆమె మరణించే వరకు తన పనులు తానే చేసుకునే వారని కుటుంబ సభ్యులు తెలిపారు. 25 ఏళ్ల నుంచి ఒంటి పూట భోజనం చేస్తున్నారన్నారు. గ్రామంలోని శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.
17న జాబ్‌మేళా
కొత్తపేట: స్థానిక వీకేవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 17న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ డాక్టర్ కేపీ రాజు తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. కళాశాల జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జేకేసీ) అండ్ ప్లేస్‌మెంట్ సెల్, వికాస సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎస్‌బీ మోటార్స్, కేపీపీ పేపర్స్, అవంతి ప్రోజెస్ ఫుడ్స్, ఎల్‌ఐసీ, డెక్కన్ ఫైన్ కెమికల్స్, ఐజాన్ ఎక్స్పీరియన్సెస్, ఫోక్స్‌కాన్, హుండాయ్ మోబిస్, ఎస్‌ఎస్‌ఆర్ ఎల్‌టీఎల్ ట్రైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్, శివానిక్, ఇసుజు మోటార్స్ తదితర సంస్థలు ఈ మేళాకు హాజరై తమ ఆయా కంపెనీల్లో సుమారు 820 ఉద్యోగాలను భర్తీ చేయనున్నాయి. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లమా, బీటెక్, పీజీ చదివిన వారందరూ తమ సర్టిఫికెట్లతో జాబ్‌మేళాకు హాజరుకావచ్చు. మరిన్ని వివరాలకు 81798 24845, 97043 02775, 98497 11253 నంబర్లను సంప్రదించాలి.
● అక్రమంగా 700 టన్నుల నిల్వ
● కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు
జనసేన నాయకుడి ఇసుక దందా