
తిరుమల విద్యార్థులకు అభినందన
రాజమహేంద్రవరం రూరల్: నీట్ 2025 ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 19వ ర్యాంకు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన రాజమహేంద్రవరం తిరుమల కళాశాల విద్యార్థి డి.కార్తిక్ రామ్‌కిరీటిని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందించారు. జేఈఈ అడ్వాన్స్‌డ్–2025లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఆలిండియా 8వ ర్యాంకు సాధించిన కె.యశ్వంత్ సాత్విక్, ఎస్‌సీ కేటగిరీలో ఆలిండియా రెండవ ర్యాంకు సాధించిన కె.ప్రణీత్‌లకు పుష్పగుచ్ఛం అందజేసి సత్కరించారు. ఈ ఘనతను సాధించిన తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావును మంత్రి లోకేష్ అభినందించారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో తల్లిదండ్రులతో కలసి ఆయా విద్యార్థులు సోమవారం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ చిన్న విషయాలకే నేటితరం విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని, లైఫ్ అంటే చాలెంజ్ అన్నారు. దాన్ని స్వీకరించాలే తప్ప అధైర్యపడకూడదన్నారు. ఆ విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. కలల సాధనకు నిరంతరం శ్రమించాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.