ప్రైవేటు ఫీజులుం | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు ఫీజులుం

Jul 1 2025 4:02 AM | Updated on Jul 1 2025 4:02 AM

ప్రైవ

ప్రైవేటు ఫీజులుం

విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి

యథేచ్ఛగా దోపిడీ

ఒకటో తరగతికే

కనీస ఫీజు రూ.25 వేలు

బస్సుకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు

యూనిఫామ్‌, నోట్‌ బుక్స్‌కు

అదనపు భారం

సాక్షి, అమలాపురం: ‘కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్లిన రోగి విషయంలో వైద్యులు చెప్పిందే వేదం.. చేయించిందే పరీక్షలు.. కట్టమన్నదే ఫీజు.. మారు మాట్లాడకుండా అన్నీ వినాల్సిందే. ఇప్పుడు ప్రైవేట్‌ స్కూళ్లలోనూ అదే జరుగుతోంది. వారు చెప్పినంతే ఫీజు.. పుస్తకాలకు, యూనిఫామ్‌ వంటి వాటికి ఎంతంటే అంతే.. నోరు మెదపకుండా చెల్లించాల్సిందే’ అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదనతో అంటున్న మాటలు ఇవి. ప్రస్తుతం కార్పొరేట్‌, ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులు విద్యార్థులకు పెనుభారంగా మారాయి. వేలకు వేలు ఫీజులకు తోడు యూనిఫామ్‌, టై, బెల్టు, బూట్లు, పాఠ్య, రాత పుస్తకాలు.. ఇలా అన్నీ తాము చెప్పిన చోటే తాము చెప్పిన ధరకే కొనాలంటూ ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు విధిస్తున్న ఆంక్షలు తల్లిదండ్రులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వ కార్పొరేట్‌ అనుకూల విద్యా విధానంతో ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు చెలరేగిపోతున్నాయి.

జిల్లాలో మొత్తం 454 ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. వీటిపై విద్యాశాఖ నియంత్రణ రానురాను తగ్గిపోతోంది. ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న ఒత్తిడి జిల్లా స్థాయిలో విద్యాశాఖ అధికారుల చేతులు కట్టేస్తున్నాయి. దీంతో ప్రైవేట్‌ పాఠశాలల్లో అసలు ఏం జరుగుతుందో కనీసం అధికారులు కన్నెత్తి చూడడం లేదు. ఇదే అదునుగా ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. స్కూళ్ల యాజమాన్యాలు నిబంధనలను బేఖాతరు చేస్తున్నా కనీసం అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదు. ఒకటో తరగతి ఫీజు రూ.25 వేల పైనే.. కొన్ని కార్పొరేట్‌ స్కూళ్లలో అయితే రూ.50 వేల కూడా ఉంది. గత ఏడాది కన్నా ఈ ఏడాది ఫీజులు పెరుగుదల 30 శాతం దాటిందని అంచనా. ఇది మధ్య తరగతి ప్రజలకు భారంగా మారింది. దీనికితోడు యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోట్‌ బుక్స్‌కు అదనం. బస్సు ఫీజులు అయితే మరింత భారం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కిలోమీటరుకు విద్యార్థుల నుంచి బస్సు ఫీజు రూ.1.30 మాత్రమే వసూలు చేయాలి. అయితే ఏడాదికి బస్సుకు రూ.10 వేలు మొదలు రూ.15 వేల వరకూ వసూలు చేస్తుండడం గమనార్హం. దీంతో ఒకటో తరగతి విద్యార్థికే మొత్తం అన్నీ కలిపి రూ.40 వేల నుంచి రూ.65 వేల వరకూ ఖర్చు అవుతోంది.

పర్యవేక్షణ కమిటీలు ఎక్కడో?

ప్రైవేట్‌ పాఠశాలలపై ఉన్న నిబంధనల అమలుకు కనీసం కమిటీలు ఎక్కడా కనిపించడం లేదు. త్రీ మెన్‌ కమిటీ రూపంలో మండల విద్యాశాఖ అధికారి, ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం, ఒక క్లస్టర్‌ స్కూల్‌ హెడ్యాస్టర్లతో ప్రైవేటు పాఠశాలలను తనిఖీ చేయాల్సి ఉండగా, అవి అమలు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. మానసికంగా, శారీరకంగా విద్యార్థులు ఉండాలంటే అందుకు తగ్గ వాతావరణం కల్పించాలి. వ్యాయామ ఉపాధ్యాయుల నియామకంతోపాటు ఆట స్థలం కూడా ఉండాలి. కానీ అటువంటి పరిస్థితులు ఏమీ కానరావు. బహుళ అంతస్తుల భవనాల్లో పాఠశాలలు నిర్వహిస్తున్నా అధికారులు అనుమతులు ఇచ్చేస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా వాస్తవ రూపంలో అవి అమలుకు నోచుకోవడం లేదు. దీనిపై విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేస్తున్నా, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు వస్తున్నా పరిశీలిస్తామని చెప్పడం తప్ప అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.

అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్టు విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రైవేట్‌ పాఠశాలలు ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి పనిచేయాలి. అలాగే ఫీజులు కూడా వసూలు చేయాలి. విద్యా శాఖ కూడా ఫీజుల వసూలుపై నిఘా పెట్టింది. ఆయా పాఠశాలలను సందర్శించడం ద్వారా అధిక ఫీజులు తీసుకోకుండా చర్యలు తీసుకుంటాం.

–డాక్టర్‌ షేక్‌ సలీం బాషా, డీఈఓ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ

ఫీజులు తగ్గించపోతే ఉద్యమం

ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీ అరికట్టాలి. ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేసి ప్రతి స్కూల్‌ వద్ద నియమ నిబంధనలతో నోటీసు బోర్డు పెట్టేలా చర్యలు తీసుకోవాలి. ఫీజులు తగ్గించకపోతే ఉద్యమం చేస్తాం. అధిక ఫీజులు దోపిడీ చేస్తున్న విద్యా సంస్థలకు కొమ్ముకాస్తున్న విద్యా శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

–రేవు తిరుపతిరావు,

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

గత ప్రభుత్వంలో నిరంతర నిఘా

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలపై నిరంతరం నిఘా కొనసాగేది. ఫీజులకు సంబంధించి అధికారులు తనిఖీలు నిర్వహించే వారు. దీంతో యాజమాన్యాలు వెనకాడే పరిస్థితి ఉండేది. 2020 విద్యా విధానం ప్రకారం గత ప్రభుత్వం రాష్ట్రంలో పాఠశాల విద్యకు సంబంధించి మూడు రకాల ఫీజులు ప్రకటించింది. ఈ ఫీజులన్నీ కూడా 2023–24 విద్యా సంవత్సరం వరకూ అమలులో ఉన్నాయి. దాని ప్రకారం నర్సరీ మొదలు పదో తరగతి వరకూ గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు అయితే రూ.10 వేల మొదలు రూ.12 వేల వరకూ వసూలు చేయాల్సి ఉంటుంది. ఇక మున్సిపాలిటీల్లో రూ.11 వేల నుంచి రూ.15 వేల వరకూ, కార్పొరేషన్‌ ప్రాంతాల్లో రూ.12 వేల నుంచి రూ.18 వేల వరకూ వసూలు చేయాలని పేర్కొన్నారు. ఈ విధానాన్ని ‘కూటమి’ కొనసాగించకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం నర్సరీ విద్యార్థికే రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకూ ఫీజులు వేస్తున్నారు. ఇవి కాకుండా యూనిఫాం పాఠశాలలలో, లేదా యాజమాన్యం సూచించిన షాపులో కొనుగోలు చేయాలనే ఆంక్షలతో పాటు, టై, బెల్టులు పాఠశాలలోనే కొనుగోలు చేయాలని అంటున్నారు. ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు మాత్రమే వినియోగించాలని నిబంధన ఉన్నా అది అమలు కావడం లేదు. ప్రత్యేకంగా మెటీరియల్‌ రూపొందించి వాటిని విక్రయిస్తున్నా విద్యాశాఖ అధికారులు తమకేమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. దీనిపై అధికారులు తమ దృష్టికి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారే తప్ప, తాము ఎన్ని పాఠశాలలు తనిఖీ చేసింది.. ఏ ఏ పాఠశాలల్లో ఎటువంటి లోపాలు ఉన్నాయి.. వాటి నియంత్రణకు యాజమాన్యాలకు చేసిన సూచనలు ఏమైనా ఉన్నాయా అనేది మాత్రం ప్రకటించలేక పోతుండడం గమనార్హం.

ప్రైవేటు ఫీజులుం1
1/3

ప్రైవేటు ఫీజులుం

ప్రైవేటు ఫీజులుం2
2/3

ప్రైవేటు ఫీజులుం

ప్రైవేటు ఫీజులుం3
3/3

ప్రైవేటు ఫీజులుం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement