
ఆంధ్రా అరుణాచలంలో.. ఆధ్యాత్మిక శోభ
● 7న 63 మంది నాయనార్ల విగ్రహాల ప్రతిష్ఠ
● ఇతర దేవతా విగ్రహాలు కూడా..
● తరలిరానున్న ప్రముఖులు
నాయనార్లు ఎవరంటే..
తమిళనాడులో 5 – 10 శతాబ్దాల మధ్య నివసించిన గొప్ప శివ భక్తులే ఈ నాయనార్లు. 13వ శతాబ్దంలో రచించిన తమిళ ప్రబంధం పెరియ పురాణం ప్రకారం వీరు మొత్తం 63 మంది. వీరు భక్తి ద్వారా మోక్షసిద్ధి పొందినట్లు ఈ పురాణం ద్వారా తెలుస్తోంది. నాయనార్లలో రాజుల నుంచి సాధారణ మానవుల వరకూ అన్ని స్థాయిల వారూ ఉన్నారు. భగవంతుడిని చేరడానికి నిష్కల్మషమైన భక్తి తప్ప ఇంకేదీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి.
ప్రత్తిపాడు రూరల్: తమిళనాడులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలాన్ని తలపించేలా.. ప్రత్తిపాడు మండలం రాచపల్లిలోని శ్రీ రమణ సేవాశ్రమం సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటోంది. ఈ ఆధ్యాత్మిక కేంద్రం మూడు దశాబ్దాలుగా అనేక మందిని భగవాన్ రమణ మహర్షి బోధించిన మార్గంలో పయనింపజేస్తూ.. సంఘహిత కార్యక్రమాలు చేపడుతూ.. ఇటు భక్తుల, అటు ప్రజల ఆదరణను చూరగొంటోంది. రాచపల్లికి చెందిన కవల బ్రహ్మచారులు రమణానంద, లక్ష్మణానందలు ఆధ్యాత్మిక సాధనలో రమణ మహర్షి బోధనల పట్ల ఆర్షితులయ్యారు. వీటి ద్వారా సమాజాభివృద్ధికి దోహదపడాలనే కాంక్షతో 1990 ఆగస్టు 15న 16వ నంబరు జాతీయ రహదారిని ఆనుకొని రాచపల్లి సమీపాన ప్రజల విరాళాలతో నాలుగెకరాల స్థలాన్ని సమకూర్చి ఈ ఆశ్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ రమణ మహర్షి ప్రధానాలయం, ధ్యాన మందిరం ఈ ఆశ్రమాన్ని ఆనుకొని 2019 మార్చి 6న శ్రీ అపీతకుచాంబ సమేత అరుణాచలేశ్వరస్వామి ఆలయాన్ని, దక్షిణామూర్తి, గణపతి, కుమారస్వామి ఉపాలయాలను నిర్మించారు. క్రమంగా ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని ఆంధ్రా అరుణాచలంగా తీర్చిదిద్దారు. తొలుత స్థానికులు మాత్రమే ఈ క్షేత్ర దర్శనానికి వచ్చేవారు. అనతి కాలంలోనే పరిసర మండలాలు, జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల వారు సైతం ఈ క్షేత్ర దర్శనానికి వస్తున్నారు. ఈ సుప్రసిద్ధ ఆలయంలోని మండపంలో ఈ నెల 7న మహా శివభక్తులైన 63 నాయనార్ల విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. వీరితో పాటు ఉపాలయంలో దక్షిణామూర్తి, లక్ష్మీ హయగ్రీవుడు, సూర్య భగవానుడు, కాలభైరవుడు, గంగా మాత విగ్రహాలను కూడా ప్రతిష్ఠించనున్నారు.
ప్రతిష్ఠామహోత్సవాలు ఇలా.. : నాయనార్ల విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి పలువురు ప్రముఖులు తరలి రానున్నారు. తిరువణ్ణామలై అరుళ్లిగు అరుణాచలేశ్వరస్వా మివారి దేవస్థానం అర్చకుడు టి.అరుణాచల కార్తికే య శివాచార్య ఆధ్వర్యాన నాయనార్ల విగ్రహాల ప్రతి ష్ఠ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 4న గోపూజ, గణపతి హోమం, లక్ష్మీ హోమం, నవగ్రహ హోమం నిర్వహిస్తారు. 5న తీర్ధ సంగ్రహణం, అగ్నిసంగ్రహణం, దిశాహోమం, శాంతిహోమం, మూర్తి హోమం అనంతరం రక్షోఘ్నం, గ్రామ శాంతి, ప్రవేశ బలి, 6న స్వామి అనుజ్ఞ, అంకురార్పణ, యాగశాల నిర్మాణం, అశ్వపూజ జరుగుతాయి. 7న నాయనార్ల విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. అనంతరం కుంభాభిషేకం నిర్వహిస్తారు. ఈ వేడుకకు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ, కృష్ణా జిల్లా పెదపులిపాక విజయ రాజే శ్వరి దేవస్థానం పీఠాధిపతి వాసుదేవానందగిరి స్వా మీజీతో పాటు పలువురు ఆధ్యాత్మికవేత్తలు, ఉప ము ఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పలువురు రాజకీయ ప్రముఖులు, భారీ సంఖ్యలో భక్తులు హాజరుకానున్నారు.
విజయవంతం చేయాలి
ఆంధ్రా అరుణాచల క్షేత్రంలో ఈ నెల 7న నాయనార్ల విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభోపేతంగా జరుగుతుంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. వారికి, ప్రముఖులకు ఎటువంటి అసౌకర్యాలూ కలగకుండా విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని భక్తులు విజయవతం చేయాలి.
– స్వామి రామానంద,
శ్రీరమణ సేవాశ్రమం పీఠాధిపతి, రాచపల్లి

ఆంధ్రా అరుణాచలంలో.. ఆధ్యాత్మిక శోభ

ఆంధ్రా అరుణాచలంలో.. ఆధ్యాత్మిక శోభ